నడిరేయి

తనపై చేతిని వేశాను
ఒళ్ళు చల్లబడినట్టు అనిపించింది
చేతిని గట్టిగా పట్టుకుని
పేరుతో పిలిచాను
లేవలేదు
 
ఒక్కసారి నేను చల్లబడిపోయాను
సులోచనాల్ని తగిలించుకుని
లైటు వేశాను
 
పడుకునే ఉంది
ఏ చిన్నపాటి కదలిక లేకుండా
 
తన్ని కుదుపుతూ
మాట్లాడవేమని పీల స్వరంతో వేడాను
చలనం లేదు
 
చచ్చేంత భయంతో
ముఖంలోకి ముఖం పెట్టాను
 
పెద్దబొట్టు ఒంటి ముక్కురాయి
శాంతంగా రోజులానే కనిపించింది
పలుకు లేదంతే!
 
హడావిడి చేయడానికి
వయసు లేదు
అర్థం అయింది
 
అలాగే వద్ద కూర్చుని
తన అరచేతిని చేతుల్లోకి తీసుకుని
మౌనంగా చూస్తున్నాను
 
ఎండిన దుఃఖం
లోన కుండపోతగా కురుస్తోంది
ఒక్క చుక్క బయటకు రావటం లేదు
 
పైరును కోసిన తరువాత
ఒట్టిపోయిన పొలంలా
కోతతో మనసు మూగబోయింది
 
ఫోనొత్తి అందర్నీ పోగేయాలనుకున్నాను
చేయాలనిపించలా
తనతో ఇలాగే 
మౌనంగా మాట్లాడాలి
 
ఇంతటి ఏకాంత నిశ్శబ్దం
అందరూ వచ్చాక దక్కదు
జంట ప్రయాణం ఈ వేళతో
ఇదే ఆఖరు
 
రేపు భౌతికంగా తను ఉండదు
గోడకు పటమై వేలాడుతుంది
 
ఈ కుదుపుకు నేను
చచ్చి బతుకుతానో
బతికి చస్తానో... తెలియదు
 
జ్ఞాపకాలన్నింటినీ తోడుకుంటున్నాను
తను నాలో ప్రవహించిన జీవనది
 
వేకువా తొందరగా తెలవారకు
రేపటి తన సమాధి వద్ద
ఇంత ప్రశాంత దుఃఖాన్ని
అనుభవించలేను
 
ఈ రాత్రి తను ఇంకా
నాతో బతికేవుంది. 
 
************
తెలుగు వెంకటేష్‌
99853 25362