మనలో ఎవరూ నిత్య నిబద్ధులు కారు-దేనికైనా. నిబద్ధులమనుకునే ధోరణి ఒకటి ప్రబలంగా ఉండేది. దాని ఛాయలు ఇప్పటికీ ఉన్నాయి. కవిత్వాన్ని మనలోకి తీసుకుని, మన లోలోతుల్లోంచి పలవరించేప్పుడు- కేవలం నమ్మే అభిప్రాయాలు, భావాల వంటి బహిర్గత అంశాలే కాకుండా, మన అంతరంగం చీకటి కూడా కవిత్వానికి అంటుకుంటుంది. వాస్తవానికి అదే కవిత్వానికి బతుకునిస్తుందనుకుంట.
ప్రశ్న:మీ తొలి కవితా సంపుటి ‘ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’, ఇటీవల విడుదలైన మీ రెండవ సంపుటి ‘దుర్గాపురం రోడ్’... ఈ రెండింటి మధ్యా కవిత్వంతో మీ అనుబంధంలోని మార్పేమైనా గమనించారా?
జవాబు:కవిత్వంతో అనుబంధం నిరంతరం కొనసాగు తూనే ఉంటుంది. ఏ పని చేస్తున్నా ఒక పార్శ్వం కవిత్వాన్ని అన్వేషిస్తూనే ఉంటుంది. మొదటి సంపుటి ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’ అప్పుడూ అంతరంగంగానూ, బహిరంగంగానూ కవిత్వమే తిరుగుతూ ఉండేది. ఖాళీ దొరికితే కవిత్వం చదువుకోవడం, ఆనందించడం.. ఎవరైనా కలిస్తే కవిత్వం గురించి మాట్లాడుకుంటూ గంట లేమిటి రోజుల తరబడి గడిపేయడం. ఆ తరు వాత నెమ్మదిగా సాహితీ మిత్రులను కలవడం కొంత తగ్గిపోయింది. ఒకవేళ కలి సినా కాసేపు ఏదో మాట్లాడుకుని విడిపోవడమేగానీ, కవిత్వాన్ని కల బోసుకునే సంఘటనలు అరుదైపో యాయి. ఎవరి జీవన వ్యాపకాల్లో వాళ్లం ఇరుక్కుపోవడం వల్ల కొంత నిర్మొహమాటం కరువైపోవడం మరికొంత కారణం కావచ్చు. అయినా, లోలోన కదలాడే కవిత్వ జల ఉబుకుతూనే ఉండేది. నాలో నేనే, నాకు నేనే కవిత్వాన్ని చెప్పుకుంటూ, నెమరేసుకుంటూ తన్మయత్వంలో ఓలలాడే వాడిని. అలా ఎన్నో కవితలు-కేవలం ఏవో కొన్ని లైన్లు కావు-పూర్తయినవి ఉన్నాయి. కానీ, అనేకానేక కారణాల వల్ల కొన్ని మాత్రమే కాగితం మీదకీ లేదంటే కంప్యూటర్లోకీ ఎక్కాయి. అవే మిమ్మల్ని ‘దుర్గాపురం రోడ్’ రమ్మని ఆహ్వానిస్తున్నాయి.