ప్రవాసాంధ్ర రచయిత, కవి, కథకుడు అంబల్ల జనార్దన్.ముంబయిలో తెలుగు సాహిత్యాభివృద్ధికి శ్రీకారం చుట్టి సాహిత్యరంగంలో ‘ముంబయి జనార్దన్’ గా పేరొందిన రచయిత అంబల్ల జనార్దన్.ముంబయిలో ఎంతోమంది యువ రచయితలను తయారు చేశారాయన. ముంబయిలో తెలుగువారి జీవనస్థితిగతులను తన కథల్లో ప్రతిబింబిస్తూ తెలుగువారు అత్యధికంగా ఉండే ముంబయి ప్రాంతానికీ–తెలుగు రాష్ర్టాలకు మధ్య వారథిగా ఉంటూ ముప్ఫైఏళ్ళుగా సాహిత్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు . ఇప్పటివరకు ఆయన 15 పుస్తకాలు వెలువరించారు. . ప్రపంచలంలో తెలుగువారు ఏ దేశంలో ఉన్నా తెలుగు భాషా సాహిత్యాలే మనకు బొడ్డుతాడు అంటున్న జనార్దన్ ఇంటర్వ్యూ...
నిజామాబాద్జిల్లా మోధాన్ మండలం ధర్మోరా గ్రామ పద్మశాలీ కుటుంబీకుడు జనార్దన్.ఆయన తండ్రి అంబల్ల నర్సయ్య. తల్లి నర్సవ్వ. ఉపాధి అవకాశాలు కొరవడటంతో తండ్రి ముంబయికి వలసవెళ్ళారు. దాంతో జనార్దన్ పుట్టుక, చదువు, ఉద్యోగం అన్నీ ముంబయిలోనే. ఏడుగురు సంతానంలో ఆయనే పెద్ద. ఆయనకు ఐదుగురు చెల్లెళ్ళు, తమ్ముడు.స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడు ఓగేటి పరీక్షిత్ శర్మ ప్రోత్సాహంతో తెలుగు భాషాచంధస్సు నేర్చుకున్నారు జనార్దన్. తెలుగుసహా హిందీ, ఇంగ్లీషు, మరాఠి, గుజరాతీ భాషలు అనర్గళంగా మాట్లాడగలస్థాయికి ఎదిగారు. మాతృభాషపట్ల ప్రేమతో తెలుగు దిన, వార, మాస పత్రికలు క్షుణ్ణంగా చదివేవారు. పత్రికల్లో వ్యాసాలు రాసేవారు.రెండేళ్ళు కాలేజీలో చదివి సెలవురోజుల్లో ముంబయి యూనివర్సిటీ తరపున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టెంపరరీ క్లార్క్ (1969) గా, ఆ తర్వాత పూర్తిస్థాయి (1970) ఉద్యోగిగా స్థిరపడి, ఎంకాం, ఎల్.ఎల్.బి పూర్తి చేశారు.
పదోన్నతులకోసం ప్రైవేటురంగంలో పనిచేశారు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగి స్వచ్ఛంధ పదవీ విరమణ (2007) చేశాక సాహిత్య వ్యాసంగంపై మరింత దృష్టి కేంద్రీకరించారు. ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా కార్పొరేట్ సంస్థలకు ప్రస్తుతం సలహాదారుగా ఉన్నారు.కవిత్వంబాల్యం నుంచీ జనార్దన్కు అనుకరణ విద్య అలవడింది. సినిమా పాటలు పేరడీచేసి పాడుతూ, అందరినీ నవ్వించేవారు. స్కూల్ ఫేర్వెల్ ఫంక్షన్లో గురువులకు కృతజ్ఞతలు చెబుతూ సొంతంగా పాటరాసి పాడారు. ముంబయి సాంస్కృతిక సంఘంవారి నాటకాల్లో కృష్ణుడుగానూ, సారంగధర లాంటి యక్షగానాల్లోనూ నటించేవారు. ఆంధ్ర యువజన స్నేహమండలి స్థాపించి సేవలందించారు. అంబల్ల జనార్దన్ ఇప్పటివరకు మూడు కవితా సంపుటిలు వెలువరించారు. ‘ముంబయి నానీలు’ (2001), ‘ముంబయి మువ్వలు’ (2007), జనార్దన్ షష్టిపూర్తి సందర్భంగా వెలువరించిన ‘ముంబయి చాట్ భేల్’ (2010) కవితా సంపుటిలు వెలువడ్డాయి. ‘మరో 70–80 కవితలతో మరో కవితా సంపుటి 2020లో రాబోతోంది. ఆయన స్ఫూర్తితో ముంబయిలో చాలామంది నానీలు రాశారు. ఆయన వ్యాస సంపుటి ‘వ్యాసగుచ్ఛం’ పేరిట వెలువడింది.
తెలుగు, మరాఠా పుస్తకాల్లోపాఠ్యాంశాలుగా కథలుఅంబల్ల జనార్దన్ తొలి కథ ‘వీడిన మబ్బులు’ (1993). కొడుకులకోసం, కొత్త తరం ఆలోచనలను అందిపుచ్చుకున్న ఓ తండ్రి కథ ఇది. ‘మయూరి’ వారపత్రికలో ప్రచురితమైంది.‘అమృత కిరణ్’ పక్ష పత్రిక నిర్వహించిన జాతీయస్థాయి కథలపోటీల్లో ఆయన రాసిన ‘చమురుదీపం’ కథకు ద్వితీయ బహుమతి లభించింది. 1556కథల్లో అగ్రభాగాన నిలిచి బహుమతి గెలుచుకుంది. మహారాష్ట్ర తెలుగు మున్సిపల్ పాఠశాలలోనూ, మరాఠీభాషలో సెవెన్త్ విద్యార్థులకు ‘వీడని మబ్బులు’ కథ ఇరవైఏళ్ళుగా పాఠ్యాంశంగా కొనసాగడం ఒక ప్రత్యేక విశేషం. ఈ ఏడాది ఈ కథను 11వ తరగతిలో చేర్చడంతోపాటు, ఆయన మరో నాలుగు కథలు కూడా మరాఠా, తెలుగు భాషల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ‘బయలు బతుకు’ అనే మరో కథను ఈ ఏడాది మరాఠా, తెలుగు స్కూల్స్లో టెన్త్వారికి పాఠ్యాంశంగా చేర్చారు.