హృదయంతో అక్షరాలు రాసే రచయిత్రి శ్రీమతి పసుపులేటి సత్య శ్రీనివాస్.‘నువ్వే నా ప్రాణం’ సీరియల్‌తో నవలా ప్రపంచంలోకి దూసుకొచ్చిన కొత్త కెరటం ఆమె.కుటుంబ విలువలకు పట్టం కట్టే రచనలతో సాహిత్యలోకంలో పరవళ్ళు తొక్కుతోంది ఆమె కలం. తన శరీరంలో ని అవయవాన్ని తన జీవితభాగస్వామికి ఇచ్చి ప్రాణంపోసిన స్ర్తీ రత్నం, మాతృమూర్తి శ్రీమతి సత్యశ్రీనివాస్.సాహిత్యంలో బంధాలు,అనుబంధాలకు, కుటుంబ విలువలకు పెద్దపీటవేసే తన అక్షరం–ఆచరణ రెండూ ఒకటే అంటున్న ఆమె ఇంటర్వ్యూ ఈ వారం...
పశ్చిమగోదావరిజిల్లా తణుకులో జన్మించారు శ్రీమతి సత్యశ్రీనివాస్. ఆమె తండ్రి బొరుసు చంద్రరావు. తూర్పుగోదావరిజిల్లా కొత్తపేటలో పోస్ట్‌మాస్టర్‌గా పనిచేశారు. తల్లి పూర్ణచంద్ర కళావతి. సోదరుడు వెంకట ఉదయభాస్కర్. గాయత్రీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వైస్‌ప్రెసిడెంట్. ఆమె సోదరి ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు.బాల్యం నుంచీ తండ్రి ప్రోత్సాహంతో పుస్తకాలు ఇష్టంగా చదివారు సత్యశ్రీనివాస్.పురాణేతిహాస కథలు, నీతికథలు, వేమన, బద్దెన తదితరుల శతకాలు, పొడుపుకథలు, సామెతలు, చమత్కార ప్రయోగాల గురించి చెప్పడం, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి లాంటి బాలల పుస్తకాలు కొనిచ్చి చదవమని ప్రోత్సహించే తండ్రి మార్గదర్శకత్వంలో ఎదిగి తెలుగుభాషపైన, సాహిత్యంపైన మమకారం పెంచుకున్నారు.
చదువులో అందరికంటే ముందుడే సత్యశ్రీనివాస్ ఏడాదికి రెండేసి క్లాసులు చదివేసి ‘ఇంటూ ఫస్ట్‌ఫార్మ్’ పద్ధతిలో హైస్కూలు స్థాయికి చేరుకుని, పదేళ్ళ వయసుకే ఎనిదోతరగతి చదివి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆమె.ఆంధ్రప్రభలో కొండముది శ్రీరామచంద్రమూర్తి రాసిన ‘‘చిరుమువ్వల సవ్వడి’ సత్యశ్రీనివాస్ చదివిన తొలి ధారావాహిక. ఆ పేరు, ఆ కథ ఆమెకు ఎంతో నచ్చేసింది. అలా ఆమెలో సాహిత్యాభిలాష పెరిగింది. తొమ్మిదో తరగతిలోనే యండమూరి ‘తులసీదళం’ నవల చదివారు. హిందీ పరీక్షల్లో పాసవుతూ హిందీలో ప్రేమ్‌చంద్ కథలు, నవలలు చదివారు.రాజోలు సాహితీస్రవంతివారి మినీ కవితలపోటీల్లో పాల్గొని, ప్రముఖ రచయిత అద్దేపల్లి రామారావు చేతులమీదుగా ‘గాలిబ్ గీతాలు’ పుస్తకం ప్రథమ బహుమతిగా పొందడం ఆమెకు ఒక స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకం.
కళాశాలస్థాయి కవితలపోటీల్లో ‘రేపటి సూరీడు’ అనే ఆమె కవితకు ద్వితీయ బహుమతి లభించింది. ఆనాడు ఆ పోటీల్లో ప్రథమ బహుమతి సుకుమార్ అనే యువకుడికి లభించింది. అతడే ఈనాటి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కావడం సత్యశ్రీనివాస్ కాలేజీ జీవితంలో ఒక చెప్పుకోదగిన జ్ఞాపకం.వివాహానంతరం గోవాలో స్థిరపడి, నౌకాదళ పాఠశాలలో హిందీపండిట్‌గా పనిచేస్తూ, స్వరాష్ట్రం నుంచి తనకు నచ్చిన తెలుగు సాహిత్యం తెచ్చుకుని చదువుకునేవారు. అలా తనకిష్టమైన యండమూరి పూర్తి సాహిత్యంతోపాటు యద్దనపూడి, కౌసల్యాదేవి, మల్లాది, కొమ్మనాపల్లి గణపతిరావు, కొమ్మూరి సాంబశివరావు వంటివారి నవలలు విస్తారంగా చదివారు.
కథారచన
ఇప్పటివరకు 60 కథలు రాశారు సత్యశ్రీనివాస్. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో మొదటి కథ రాసి పత్రికకు పంపారు. అలా ఆమె తొలి కథ ‘ఒక్క క్షణం ఆలోచించండి’ 2016 మార్చిలో ఆంధ్రభూమి వారపత్రికలో వెలువడింది. స్నేహం పేరుతో ఆడప్లిలలు మోసగాళ్ళ వలలో పడకూడదనేదే ఆ కథ సారాంశం. ఆ తర్వాత వరుసగా నవ్యవీక్లీ సహా పలు పత్రికల్లో ఆమె కథలు వెలువడ్డాయి.