ఆత్మవిశ్వాసానికి ఆలవాలం .. కొండపొలం
2019 ‘తానా’ మహాసభల సందర్భంగా నిర్వహించిన పోటీలో రెండులక్షల పారితోషికం పొందిన నవల ‘కొండపొలం’. ఇది గొర్రెల కాపరుల జీవికను కళ్లకు కట్టిన ‘ఫిక్షన్’ మాత్రమే కాదు, జీవితంలో గెలవడానికి ఆత్మవిశ్వాసం నింపే ‘నాన్ఫిక్షన్’ కూడా. కరువు రోజుల్లో గొర్రెలను మేపడానికి నల్లమలలో గొల్లలు సాగించిన ప్రస్థానం నవల ఇతివృత్తం. డిగ్రీ పూర్తి చేసి, తప్పని పరిస్థితిలో తండ్రికి తోడుగా ‘కొండపొలం’ వెళ్లిన రవీంద్ర ఇందులోని కథానాయకుడు. ఈ అరణ్యయానం రవీంద్రలోని పిరికితనం పారదోలి, ఆత్మస్థైర్యంతో అతడు తన లక్ష్యం వైపు ఎలా అడుగులు వేశాడో చెబుతుంది ఈ నవల. కొండల్లో, లోయల్లో తిరుగుతూ.. క్రూరమృగాల బారినుండి గొర్రెల్ని కాపాడుకునే క్రమంలో రచయిత చూపిన శిల్పచాతుర్యం రోమాంచితం! రచయిత తనకు తెలియని గొల్లల జీవితాన్ని పరిశోధించడంలో తానొక గొల్లగా మారితే తప్ప ఇంత పకడ్భందీగా ఆవిష్కరించడం అసాధ్యం. పులుల గాండ్రింపులు, కొండచిలువల ఈలలు భయోత్పాతం రేపితే, వెన్నెల్లోని అడవి వర్ణనలు ఆహ్లాదం కలిగిస్తాయి. ఆ విధంగా సన్నపురెడ్డిలోని భావుకతని పరిచయం చేస్తాయి. ముగింపులో రచయిత చెప్పినట్లు ‘అందరిలో ఉండేది భయం, బాధ్యతా రాహిత్యం - లేనిది ఆత్మవిశ్వాసం, అంకితభావం’. ఆ మాటల్ని అధిగమించడానికైనా విధిగా చదవాల్సిన నవలారాజం ‘కొండపొలం’.
- గొరుసు
కొండపొలం (నవల)
రచన: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
పేజీలు:350, వెల: రూ. 200
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు