కశ్మీర్ గుండె చప్పుళ్లు
అనేక చారిత్రక తప్పిదాలు, పాలకుల అసమర్థత, రాజకీయ పార్టీల స్వార్థం, విదేశీ శక్తుల ప్రయోజనాలు... ఇవన్నీ కలిసి కశ్మీర్ సమస్యను రావణ కాష్ఠంలా మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఒకపక్షానికి కొమ్ముకాసే మీడియాలో వచ్చే వార్తలను మాత్రమే చదివితే... అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలిసింది దాదాపూ శూన్యం. కశ్మీర్ సమస్యపై స్థానిక పౌరులు ఏం కోరుకుంటున్నారో తెలియజేస్తూ వెలువరించిన వ్యాసాల సంకలనమే శ్మశాన శాంతి. అథర్ జియా, జావైద్ ఇక్బాల్ భట్ ఇంగ్లిష్లో వెలువరించిన సంకలనాన్ని తెలుగులో తీసుకొచ్చింది మలుపు ప్రచురణలు. తమకంటే ఎన్నో రెట్లు బలమైన... రాజ్యవ్యవస్థ దాని సైనిక బలంతో 70 ఏళ్లకు పైగా ప్రతిక్షణం సంఘర్షణ పడుతూ కాశ్మీర్ పౌరులు అనుభవిస్తున్న జీవితాన్ని, వారి గుండెచప్పుళ్లని ఈ వ్యాసాలు కళ్లకు కడతాయి. కశ్మీర్ రాజకీయ సమస్యపై అవగాహన మాత్రమే కాక అక్కడి సంస్కృతి, జీవన విధానంపై కూడా అవగాహన కలుగుతుంది. ఈ పుస్తకంలోని వ్యాసకర్త గులాం రసూల్ రాసినట్లు...స్వేచ్ఛావాయువుల కోసం ప్రతి కశ్మీరీ పౌరుడు ఎదురుచూస్తున్న కల... పాఠకులను ఆలోచింపజేస్తుంది. శ్మశాన శాంతి పుస్తకంతో పాటే.. మాఢభూషి శ్రీధర్ రాసిన ‘ఎవడ్రా నన్ను పౌరుడు కాదన్నది?’, జామియా-ఆలీగఢ్- జె.ఎన్.యూ యూనివర్శిటీ దాడులపై నివేదికల సంకలనం ‘హమ్ భీ దేఖేంగే...’ కూడా ఆయా సమస్యల పట్ల విలువైన సమాచారాన్ని తీసుకొచ్చింది ఈ ప్రచురణ సంస్థ.
- చందు తులసి
1. శ్మశాన శాంతి - కశ్మీర్ నిర్బంధ కథనాలు, సంపాదకులు: రమా సుందరి, పేజీలు: 247, వెల: రూ. 190; 2. ఎవడ్రా నన్ను పౌరుడు కాదన్నది?, రచన: మాడభూషి శ్రీధర్, పేజీలు: 140, వెల: రూ.130;3. హమ్ భీ దేఖేంగే ... నిజ నిర్ధారణ నివేదికలు, పేజీలు: 86,వెల: రూ.75, ప్రతులకు: మలుపు బుక్స్, 3-6- 677/2, ఎం.ఎస్.కె. టవర్స్, స్ట్రీట్ నెం. 11, హిమాయత్ నగర్, హైదరాబాద్-29, ఫోన్ : 98665 59868