ఒక కాంతి పుంజం నాకు దారి చూపిస్తోంది. చల్లని వెలుగు.. చంద్రుని వెన్నెలేమో అన్నట్టు. ఆ వెన్నెల వెలుగులో నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాను. భయం, అనుమానం, ఆత్రుత లాంటివేమీ లేవు.. మనసంతా ప్రశాంతంగా వుంది. పూలదారిలో నడుస్తున్నట్టు అడుగులు మెత్తగా పడుతున్నాయి.కొన్ని క్షణాల్లో ...ఆ వెలుతురుకి చివర ఒక ప్రకాశవంతమైన రూపం ప్రత్యక్షమయింది! 

మనిషి ఆకారమే వుంది గానీ మొత్తం వెలుగు తప్ప ఇంకేమీ కనబడటం లేదు. నాకర్థమైంది.. ఆయనే దేవదేవుడు!‘‘బావున్నావా నాయనా?’’ ఆ వెలుగులో నుంచి ఒక మంద్ర స్వరం వినిపించింది. ఆ కంఠంలో కరుణ ఒలుకుతున్నట్టుగా వుంది.‘‘బావున్నాను స్వామీ..’’ అప్రయత్నంగా చెప్పాను.ఆ వెలుగు వెనక రూపం ఏది..? ఎలా వుంటుంది..? నా మనసులో ప్రశ్నలు..!‘‘స్వామీ.. నాకు మిమ్మల్ని చూడాలని వుంది..’’ ధైర్యంగా అన్నాను.చిన్న నవ్వు వినిపించింది.‘‘నాకు రూపం లేదు నాయనా.. ఎవరు ఎలా ఊహించుకుంటారో అలాగే కనిపిస్తాను..’’ వినిపించింది.వెలుగు మాత్రమే కనిపిస్తోందంటే నేను భగవంతుడి రూపాన్ని ఏ విధంగానూ ఊహించడం లేదన్నమాట..!‘‘చెప్పు నాయనా..? నీకేం కావాలి..?’’ ఆదరంగా అడిగాడు దేవదేవుడు.దేవదేవుడి నుంచి ఈ ప్రశ్న నేను ఊహించలేదు. ఇప్పుడు నేనేం కోరుకోవాలి..?కొన్ని క్షణాలు ఆలోచించి -‘‘ఇక్కడకొచ్చాక పుణ్యం చేసుకున్న వారందరూ స్వర్గానికి వెళ్తారని నేను కథల్లో చదివాను. నిజమేనా స్వామీ.. అలా అయితే నేను కూడా స్వర్గానికేవెళ్దామనుకుంటున్నాను..’’ నిజాయితీగా చెప్పాను.‘‘తెలుసు.. నువ్వీమాట అంటావని నాకు తెలుసు.. అంతకంటే ముందు నువ్వొక మనిషిని కలుసుకోవాలి..’’ఎవర్ని కలుసుకోవాలో ఎందుకు కలుసుకోవాలో అర్థం కాలేదు. అయినా దేవదేవుడు చెప్పాక ఇంక తిరుగేముంది..? ఎక్కువ ఆలోచించకుండా ‘‘అలాగే స్వామీ’’ అన్నాను.‘‘తథాస్తు’’ అన్నాడు దేవదేవుడు.

*****************

అదొక ప్రశాంతమైన కుటీరం.. చాలా పెద్దది గానే వుంది.చుట్టూ వెదురుతో దడి లాగా కట్టబడి వుంది. తడికెల గేటు తెరుచుకొని లోపలికి ప్రవేశించాను. లోపల ఒక పద్ధతిలో పెంచుతున్న పూల మొక్కలు, కూరగాయల పాదులు కనిపించాయి. అక్కడక్కడా జామ, మామిడి, నిమ్మ లాంటి చెట్లు వున్నాయి. ఆవరణలో రెండు ఆవులు, ఒక దూడ కూడా వున్నాయి. వాటికి రక్షణగా చిన్న పశువుల కొట్టం లాంటిది వుంది.