‘పంటచేలో పశువులో, కోతులో, జింకలో పడితే అదిరిస్తాం. బెదిరిస్తాం. అదే అడవి పందులు వస్తే పంటని కాపాడుకోవడం దేవుడెరుగు. ఎదురుపడితే ప్రాణాలు తీసేలా దాడి చేస్తు న్నాయి. పడిన శ్రమ ఫలితాన్ని ఇంటికి చేర్చుకోవడం ఎలా?’‘పలు ప్రాంతాల్లో అడవి పందులు రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. చీకటి పడితేచాలు.. గుంపులు గుంపులుగా వస్తూ పంటను నాశనం చేస్తుండడంతో రైతులు హడలి పోతున్నారు. కన్పిస్తే మనుషులపైనా దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పందించిన అటవీ శాఖ షూటర్లను రంగంలోకి దింపింది.’
‘అడవి పందులు కారణంగా ప్రధానంగా మొక్కజొన్న, వరి, సెనగ, చెరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పందులతో రెండు వందల నుంచి మూడు వందల ఎకరాల పత్తి పంటకు నష్టం జరిగింది. నాలుగేళ్లుగా వరి సాగు చేస్తున్నా ఒక్కసారి కూడా పంట ఇంటికి చేరలేదు. ఈసారి కూడా వరిపంటను నాశనం చేశాయి’.‘కిందటి సంవత్సరం ఇరవై, ముప్ఫై పందులు గుంపుగా వచ్చేవి. ఇప్పుడా సంఖ్య ఏభై నుంచి వందకి పెరిగిందని అక్కడి రైతులు చెబుతున్నారు. చింతల మండలంలో ఈ ఏట నూట ఏభై, రెండు వందల ఎకరాల మొక్కజొన్న పంట నష్టం జరిగింది’.
‘అడవి పందుల్ని కాల్చి చంపేందుకు అటవీశాఖ ఆరు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన షూటర్లు ఇరవై ఐదు మంది నిష్ణాతులతో ఓ ప్యానెల్ ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు నలభై పందుల్ని కాల్చి చంపారు. తమకు కనీస సదుపాయాలు కల్పించడం లేదని షూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఆడ పంది ఏటా పది వరకు పిల్లల్ని పెడుతుంది. రాష్ట్రంలో వీటి సంఖ్య కనీసం లక్ష ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు పంట చేలల్లో పెద్దసంఖ్యలో అడవిపందులు కన్పించాయి’.