‘‘గర్నిమిట్ట స్టేజ్ దాటినంక గానీ బస్సు నిలపబోకు .. ఆడ బాగా రద్దీగా ఉంటుంది. టిక్కెట్లు కొట్టలేక నేను చావాల’’గట్టిగా అరచి చెప్పానుడ్రైవర్ గోవిందుకు.
‘‘అట్టనే గానీ ప్రభాకరూ ... రాత్రి ఎనిమిది దాటతా ఉంది. దీని తర్వాత మళ్ళా లాస్టు బస్సు సుండుపల్లినుండే రావాల. జనాలకు కష్టం గాదా ..’’ గోవిందు వెనక్కి చూస్తూ అడిగాడు.‘‘కష్టమో నష్టమో వాండ్లే పడతార్లే గానీ నువ్వు బిర్నే బండి తోలుతా ఉండు. ఇంటికి చేరాలని లేదా ఏమి నీకూ?’’ విసుక్కున్నాను.‘‘ఎవుడైనా కంప్లైంటు చేసినాడంటే ఇద్దరికీ ఇబ్బందే కదబ్బా.. అందుకని చెప్తా ఉండా .. కానీ, నువ్వెట్టంటే అట్టే కదా నేను డ్యూటీ చెయ్యాల..’’ బస్సు జోరు పెంచుతూ అన్నాడు.నేను చెప్పినట్టుగానే గోవిందు గర్నిమిట్ట స్టేజిలో బస్సు ఆపలేదు. కొంచెం దూరంలో ముందుగానే అక్కడ దిగవలసిన వాళ్ళను దింపేసి దాదాపు ముప్ఫై మంది జనాలు అరుస్తున్నా, చేతులు అడ్డం పెడుతున్నా, ఎవర్నీ పట్టించుకోకుండా బస్సును ముందుకు ఉరకలు వేయించాడు.మరో అయిదు నిమిషాల ప్రయాణం తర్వాత కంభంవారిపల్లి స్టాపు దగ్గరికి వస్తూనే నవ్వుతూ అడిగాడు గోవిందు.
‘‘ఈడనైనా నిలపాలా వద్దా?’’‘‘ఓరినీ పాశం గాలా ... క్రిష్ణారెడ్డి హోటల్లో చపాతీ తినకుండా ఏనాడైనా లాస్ట్ డ్యూటీ ముగిసినాదా మనది’’ అంటూ నవ్వాను.‘‘రండన్నా ప్రభాకరన్నా ... మీరు బస్సు నిలపడం వల్ల అయిదారుగురు ప్యాసింజర్ల్లైనా టిఫిన్ తిని పోతే మాకూ సంతోషంగా ఉంటాది’’ వేడి చపాతీల ప్లేట్లను మా ముందు పెడుతూ అన్నాడు రవీంద్రరెడ్డి.తిండి కొంచెం ఎక్కువగా లాగించినా అది అలవాటైన పనే కాబట్టి ముందుగా చెప్పినట్టుగా పావుగంటలో కచ్చితంగా బస్సును తీయించాను. వగళ్ళలో ఆరోజు సంత కావడం వల్ల బాగా జనాలు నిలబడి బస్సుకోసం చూస్తున్నారు. వాళ్ళను ఎక్కించుకుంటే ఇబ్బంది అని నాకు తెలుసు కాబట్టి, రెండు ఫర్లాంగుల ముందే వగళ్ళలో దిగేవాళ్ళను దింపించి, గోవిందుకు స్టేజిలో బస్సాపొద్దని ముందే చెప్పాను.రాళ్ళు తప్ప మరేమి కనిపించని ఈ ప్రాంతంలో బస్సులు అరకొరగానే ఉంటాయి.
రాత్రి ఏడు గంటలు దాటాక ఆటోలు కూడా తిరగవు. అవి కూడా పీలేరునుండే రావాలి పోవాలి. ఇప్పుడంటే పీలేరుకి మకాం మార్చాను గానీ నాలుగేళ్ళ క్రితం వరకూ ఇక్కడే పుట్టి పెరిగిన. ఈ ప్రాంతం గురించి నాకు అన్ని విషయాలూ బాగా తెలుసు. అయినా కూడా మధ్యాహ్నం నుండీ డ్యూటీ చేసి చేసి అలసిపోయే నాకు కనీసం ఆఖరి ట్రిప్ అయినా ప్రశాంతంగా వెళదామని ఉంటుంది. అందువల్ల అప్పుడప్పుడూ ప్రయాణికుల మీద జాలి కలిగినా గుండెను బండ చేసుకుని ఆ బండ కింద ఆ జాలిని తొక్కిపెట్టేస్తూ ఉంటాను. నా అదృష్టం కొద్దీ నాతో డ్యూటీకి వచ్చే డ్రైవర్లు కూడా బాగానే సహకరిస్తారు. ఎందుకంటే లగేజ్ ఎక్కించుకునే డబ్బుల్లో కచ్చితంగా సగం లెక్కగట్టి ఏమాత్రం తేడా లేకుండా వాళ్ళకిచ్చేస్తాను కాబట్టి.