‘టప్..టప్’ మంటూ ఏదో దొర్లిన చప్పుడు.అప్పటికింకా ఎండా కాలం రాలేదు, కానీ ఎండ మండిపోతోంది.వేగించిన ఇసుక రజను తాకుతున్నట్టు శరీరమంతా సెగ పుడుతోంది. పైన తిరుగుతున్న ఫ్యాన్ వేడిని ఏమాత్రం తగ్గించలేక పోతోంది.అలసిన శరీరం ఇవేమి పట్టనట్టు నిద్రకు మెలకువకుమధ్య కొట్టుకులాడుతోంది.
ఇంతలో మళ్లీ మొదలు .. టప్పు టప్పూమంటూ చప్పుడు.వద్దు వద్దనుకుంటున్నా, ఆ చప్పుడు అతని చెవిలోకి బలవంతంగా చొరబడి చిరాకు పెడుతోంది. ఒక్క ఉదుటన లేచి ఆ చప్పుడు చేస్తున్న వాళ్లని ఏ బండరాయితోనో మోది చంపేయాలనుకున్నాడు. కానీ, మెదడు ఇచ్చిన ఆదేశాలను శరీరం ఖాతరు చేయలేదు.కానీ, బండరాయితో మోది చంపాలనుకోవడం - అందులోను తను .. అసలు, అలా అనుకున్నందుకే గిల్టీగా ఫీలయ్యాడు. బండరాయి అన్న మాటతోపాటే ఇటీవలి ఘటనలు గుర్తొచ్చాయి. అత్యాచారాలు, హత్యలు.. ‘ఎంత కిరాతకం’ అనుకున్నాడు.వెంటనే కూతురు గుర్తొచ్చింది.‘బంగారు తల్లి.. ఎలా వుందో?’ అనుకున్నాడు. అనుకోవడంతోనే మూసుకున్న కళ్ల వెనుక కూతురు ప్రత్యక్షమైంది. అలా కూతుర్ని చూసిన సంతోషంలో నిద్రలోనే చిన్నగా నవ్వుకున్నాడు.ఆ చిరునవ్వును చెదరగొడుతూ మళ్లీ టప్పూటప్పూ చప్పుడు.ఈసారి విసుక్కోలేదు.
ఇంక నిద్రపోవడం తన వల్ల కాదని మాత్రం అర్థం చేసుకున్నాడు. టైమ్ చూశాడు .. నాలుగవుతోంది.పిల్లలు స్కూళ్ల నుంచి తిరిగొచ్చే వేళ. ‘స్కూల్లోనే వుంటే నా కూతురు కూడా ఇదే సమయానికి తిరిగొచ్చేది’ అనుకుంటూ కిచెన్ లోకి నడిచాడు.పొద్దుటి టీ డికాషన్‌ను ఒక బర్నర్ మీద, పాలు మరో బర్నర్ మీద పెట్టాడు. నలుపు, తెలుపులో వున్న ఆ రెండింటినీ చూస్తుంటే కూతురు కళ్లలోకి కాదు, మనసులోకి చూస్తున్నట్టు అనిపించింది. వెంటనే శబ్దం వచ్చేలా బయటికే నవ్వేశాడు. తాను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అనుకున్నాడు. నలుపు, తెలుపులు రెండూ కలగలిపి.. ఛాయ్ గ్లాస్ తీసుకుని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ‘నా కూతురు కూడా మంచి చెడులను ఇలాగే సమన్వయం చేసుకుని ముందుకు పోగలదా? అయినా, అసలు దాని వయసెంతని?’అతని ఆలోచనల్ని చెదరగొడుతూ మళ్లీ ‘టప్.. టప్’ మంటూ ఏదో దొర్లుతున్న శబ్దం. ఆ చప్పుడేంటో చూద్దామని సోఫాలోంచి లేచాడు.