డిసెంబర్ మాసపు చలిని పారద్రోలడానికి తూర్పున బాలభానుడు సిద్ధమవుతున్నాడు. రాత్రి తాలూకు గాఢ నిద్ర నుండి మేల్కొని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు అనురాగ్. కప్పుకున్న ఉలెన్ దుప్పటిని తొలగించి పరుపుపై నుండి లేచి శిల్పిక కోసం చూశాడు. రెండు పడక గదుల అపార్ట్మెంట్ అది. శిల్పిక జాడ ఎక్కడా కనపడకపోయేసరికి ‘‘శిల్పా’’ అని పిలుస్తూ గదులన్నీ వెదికాడు.
‘ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళింది?’ అనుకుంటూ కాస్త కంగారుపడ్డాడు. ఫోన్ అందుకుని ఆమె నంబరు నొక్కాడు. అది రింగవుతోందిగానీ లిఫ్ట్ చేయడం లేదు. ఆందోళనతో అతని భృకుటి ముడిపడింది. అప్పుడు డోర్బెల్ మోగింది. పరుగునవెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా శిల్పిక. ‘‘ఏయ్ శిల్పా! ఇంతచలిలో ఎక్కడికెళ్ళావ్, నేనెంత కంగా...’’ అంటుండగానే, వెనుకదాచిన గులాబీగుత్తుల్ని అతనికందిస్తూ ‘‘హ్యాపీ బర్త్ డే రాగ్..’’ అంది పెదవులపై స్వచ్ఛమైన చిరునవ్వు పువ్వులు పూయిస్తూ. అప్పుడుగానీ గుర్తురాలేదతనికి, ఆ రోజు తనపుట్టిన రోజని. ఒక మధురమైన ఆశ్చర్యానికి గురైనట్టు శిల్పకేసి సంతోషంగా చూశాడు. ‘‘ఫ్లోరిస్ట్ ఇచ్చే పువ్వులతో నీకు శుభాకాంక్షలు చెప్పడం రొటీన్ అనిపించింది ఎందుకనో. అందుకే, ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక రోజ్ గార్డెన్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాను.
నీకోసం స్వచ్ఛమైన తాజా గులాబీలు తెచ్చాను. లవ్ యు రాగ్’’ అంది శిల్పిక. గుండై తడై, గాఢంగా హృదయానికి హత్తుకున్నాడామెను. హైదరాబాద్లోని ఒక బహుళజాతి సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్ అనురాగ్. శిల్పికను తొలిచూపులోనే ప్రేమించేశాడు. ఆమె పూర్తిపేరు స్వప్నశిల్పిక. ‘భువనైక సౌందర్యం’ అనే పదానికి ఆమె రూపాత్మక నిర్వచనం. ఒక తీయని కలలా ఉంటుంది శిల్పిక. ఒక అద్భుత శిల్పంలా ఉంటుంది. ఓ మధురస్వప్నాన్ని అందమైన శిల్పంలా మార్చినట్టు ఉంటుంది. బాహ్య సౌందర్యమేకాదు, ఆమె అంతఃసౌందర్యమూ అసాధారణమే. సాటిమనిషి పట్ల మానవత్వం చూపించడం, సహానుభూతితో మెలగడం కూడా కరవైపోయిన ఈ రోజుల్లో, ఆమె మాత్రం సాటిమనిషి పట్లే కాదు, తనస్థాయికన్నా దిగువన ఉండే అల్పజీవులపట్ల కూడా ఎంతో మానవీయత చూపిస్తుంది. మనకన్నా చాలా తక్కువస్థాయిలో ఉండి, మనం ఏం చేసినా ఎదురు తిరిగి ఏమీ చేయలేని ‘చిన్నవాళ్ళ’ పట్లకూడా సహృదయత చూపగలగడమే అసలైన మంచితనమైతే, అలాంటి మంచితనానికి నిలువెత్తు నిదర్శనం శిల్పిక.