ఒకానొకప్పుడు శంభవరంలో సాంబుడనే అనాథ ఉండేవాడు.పదేళ్ల వయసులోనే సాంబుడి తలిదండ్రులు పడవప్రమాదంలో చనిపోయారు. దుఃఖం పట్టలేక తను కూడా చనిపోవాలనుకున్నాడు. అప్పుడు ఒక సాధువు సాంబుణ్ణి వారించాడు. ‘‘ఇంత చిన్న వయసులో జీవితమంటే విరక్తిపుట్టడం నీ అదృష్టం. నాతో రా! నీకు సన్యాసమిచ్చి, లోకానికి ఉపయోగపడేలా చేస్తాను’’ అంటూ తనతో అడవికి తీసుకువెళ్లాడు. సాంబుడు సన్యాసం పుచ్చుకుని, ఆ సాధువు శిష్యరికంలో యోగవిద్యలు అభ్యసించాడు. తపస్సు చేసి అద్భుత శక్తులు సంపాదించాడు.
సాంబుడుకి ఇరవైఏళ్లు నిండగానే సాధువు వాడితో, ‘‘పదేళ్లపాటు విశ్రాంతి అన్నది ఎరుగకుండా నిరంతర కృషిచేసి ఎన్నో సాధించావు. ఇక నీ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచిపెట్టడానికి మనుషుల మధ్యకు వెళ్లాల్సిన సమయం వచ్చింది’’ అన్నాడు. సాధువు చెప్పినప్రకారమే సాంబుడు మనుషులమధ్యకు వెళ్లాడు. ప్రజలకు నీతిబోధలు చేస్తూ తన అద్భుతశక్తులు ప్రదర్శించసాగాడు. ఇది చూసి చాలామంది సాంబుణ్ణి దేవుడనే అనుకున్నారు. కానీ ప్రజలు తనని దేవుడిలా కొలవడం సాంబుడి కిష్టంలేదు. అందుకని సాంబుడు సన్యాసి వేషం తొలగించి, మామూలు దుస్తుల్లో ప్రజలమధ్య తిరగడం మొదలుపెట్టాడు. ఎవరికి జ్ఞానబోధ అవసరపడుతుందో, ఎవరికి తన సహాయం కావాల్సివస్తుందో చూసుకుంటూ నలుగురికీ ఉపయోగపడే పనులు చెయ్యసాగాడు.
సాంబుడు ఏదో ఒక ఇంటికి అతిథిగా వెళ్లి ఆ ఇంటి సమస్యలు పరిష్కరించేవాడు. అలా ఒకసారి సీతయ్య ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లోవాళ్ళందరూ సాంబుణ్ణి ఎంతో చక్కగా ఆదరించారు. సాంబుడు వారిని మెచ్చుకుని, ‘‘నేనెవరో తెలియకుండా నాకిన్ని మర్యాదలు చేశారు. నాకు మీ ఋణం తీర్చుకోవాలనుంది’’ అన్నాడు. అందుకు బదులుగా, ‘‘బాబూ! చూడ్డానికి దేశ సంచారిలా ఉన్నావు. వయసులో చిన్నవాడివైనా ప్రపంచంవిశేషాల గురించి నీకు నాకంటే ఎక్కువ తెలిసే ఉంటుంది. మా అబ్బాయి గంగాధరుణ్ణి ఏడాదినుంచి ఏదో తెలియని మాయరోగం పట్టిపీడిస్తోంది. ఘనమైన వైద్యులు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. అన్ని ఆశలూ వదులుకున్నాం. వాడు రోజురోజుకీ కృశించి పోతున్నాడు. ఇలాంటి జబ్బు గురించి కానీ, ఎలాంటి జబ్బులనైనా కుదర్చగల అపూర్వ వైద్యులగురించి కానీ నువ్వెక్కడైనా విన్నావా?’’ అన్నాడు సీతయ్య.