ఆకాశలోకము నుండి అవనిపైకి విసిరేసినట్టుగా ఉండేది మా పల్లెటూరు.పట్టణ నాగరికతకు దూరముగా లోకంపోకడ ఒంటబట్టని మా బాల్యంలో ఓ మారుమూల నుండేది మా ఊరు. ఊళ్లో, చౌరస్తాలు, విశాలమైన వాకిళ్లు కనువిందుగానే ఉండేవి. అయినా ఒంటిమీద మశూచిపొక్కుల్లా బజార్లనిండా చెత్తకుప్పలుండేవి. ఇళ్ళల్లోని చెత్తా–చెదారం నేరుగావచ్చి చెత్త కుప్పలతో సంగమిస్తుండేది. అవి పందులు, కుక్కలు, దోమల పాలిటి ఇలవేల్పులు.
అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లకు కిటికీలుండేవికావు. దేవాలయంపైకప్పు, ప్రభుత్వపాఠశాల భవనం జల్లెడల్లాగుండేవి. ఇలా ఊరి సమస్యలు ఉటంకిస్తూపోతుంటే చాంతాడంతవుతుంది.అప్పుడు మా ఊరి ఏకోపాధ్యాయపాఠశాలలో చదువులు రెండవ తరగతివరకే పరిమితం. విద్యార్థుల అల్లరితో దూదిఏకుతున్న దూదేకుల ఇల్లులాగుండేది. పై చదువులకోసం పాతికకిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నానికి కాలినడకన వెళ్లాల్సిందే. అయినా మాలో కొందరం ధైర్యం కూడగట్టుకుని పట్నంచదువులు కొనసాగించాం. అలా ఊరు దాటివెళ్లిన వారిలో నా లంగోటి దోస్త్ భగవాన్, నేను ఉన్నాం. మా ఊళ్లో ఒకే ఒక బంగళా ఉండేది. అది భగవాన్వాళ్లది. వాళ్ల నాన్న సలహామీదనే మా నాన్న నన్ను పట్నం పంపించారు.వాళ్లకు పదెకరాలు వ్యవసాయభూములుండేవి.
అత్తారింట్లో అన్నీ ఉన్నా అల్లునినోట్లో శని ఉందన్నట్టు మా ఊరి ప్రాంతములో వర్షాలు చినుకులకే పరిమితం. ప్రాజెక్టులేవీ లేవు. అందుకే భగవాన్వాళ్ల కుటుంబం కూడా మా కుటుంబం లాగానే పేదరికానికి పెన్నిధి అయింది.చదువులబాటలో సాగిపోయేప్పుడు నేను, భగవాన్ పట్నంలో ఒకేగదిలో ఉండి స్వయంపాకం చేసుకునేవాళ్లం. ఒకేక్లాసులో ఉండేవాళ్లం. భగవాన్ మెదడుపొరల్లో ఏం మాయ ఉందోగాని క్లాసులో ఒకసారి పాఠంవింటే ఏకసంధాగ్రాహిలా తిరిగి గడగడ అప్పుజెప్పేవాడు. అది అతనికో వరం అనుకున్నాను.