వాళ్ళంతా స్కూలు స్నేహితులు. ప్రేమించి పెళ్ళాడినవాళ్ళే. అందరూ అదృష్టవశాత్తు అమెరికాలో సెటిలైనవాళ్ళే. ఒకరోజు ఆ ఐదుగురు స్నేహితులు కలిసి కబుర్లు కలబోసుకున్నారు. భర్తలతో తమ తమ జీవితానుభవాలు, భర్తల విరుద్ధ ప్రవర్తలు అన్నీ అరమరికలు లేకుండా చెప్పుకున్నారు. అందరిజీవితాల్లోనూ ఒకే వేదన. పెళ్ళికి ముందున్న ప్రేమ సంసారంలో పెళ్ళి తర్వాత లేదు!మరి భర్తల్ని ఎలా దార్లోకి తేవాలి? అందుకు వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు?
**************************************
‘‘సాగర్ కళ్ళుమూసుకో ఒకసారి’’ అంది స్వాతి.‘‘ఎందుకు?’’‘‘మూసుకోమన్నానుగా! చెప్తానులే’’ అంది. బుద్ధిగా కళ్ళు మూసుకున్న సాగర్ మెడలో ఒక బంగారు గొలుసు వేసింది స్వాతి. దానికి హార్ట్‌షేప్‌లో ఉన్న పెండెంట్ దానిమధ్యలో ‘ఎస్’ అన్న అక్షరం నగిషీతో అందంగా చెక్కి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇప్పుడు ‘‘తెరచి చూడు’’ అంది.‘‘ఏయ్! ఏమిటిదీ? నీ మెడలో రేపు మూడుముళ్ళూ వేయాల్సింది నేను’’ అన్నాడు చేతిలోకి గొలుసు పట్టుకుని ఆశ్చర్యంగా చూస్తూ సాగర్.‘‘అందుకే, దానికంటే ముందే నీకిది మన మ్యారేజ్ గిఫ్ట్ అన్నమాట’’ అంది స్వాతి.‘‘అంటే ఇన్‌డైరెక్ట్‌గా ఇది ఫీమేల్ డామినేషన్ అని చెప్పడమన్నమాట. ఎనీ వే థాంక్యూ డియర్’’ అన్నాడు.‘‘ఆ హార్ట్‌షేప్ పెండెంట్‌లో ఉన్న ‘ఎస్’ అక్షరం నోటీస్ చేశావా లేదా! అది ఏం చెబుతోందంటే, ‘స్వాతి–సాగర్ ఇద్దరూ వేరు వేరు కాదు, ఒక్కరే’ అని దాని అర్థం తెలుసా?’’
‘‘ఓ మై గుడ్‌నెస్! ఇంత భావుకతా’’ అంటూ నవ్వాడు సాగర్.‘‘ఎలా ఉందో చెప్పవేంటి? నేనెంతో కష్టపడి స్పెషల్‌గా డిజైన్‌చేసి ఆర్డరిచ్చి చేయించాను తెలుసా’’ బుంగమూతి పెడుతూ అంది స్వాతి.‘‘ఇటీజ్ టూ గుడ్ డార్లింగ్. నీ అంత అందంగానూ ఉంది’’ అన్నాడు స్వాతిని దగ్గరకు తీసుకుంటూ సాగర్.స్వాతి, సాగర్ ఇద్దరూ అమెరికాలో ఎమ్.ఎస్. చేస్తున్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కులాంతరవివాహం. దాంతో ఇరువైపు పెద్దలు ససేమిరా కుదరదన్నారు. స్వాతి వాళ్ళ నాన్న ప్రభాకర్ జిల్లా కలెక్టర్, ఒక్కర్తే కూతురు. తమ హోదాకు తగిన సంబంధంతెచ్చి ఘనంగా పెళ్ళి చేయాలనుకున్న తరుణంలో, తను సాగర్‌ని ప్రేమించానని, అతన్ని తప్పవేరెవరినీ చేసుకోనని భీష్మించుకుని కూర్చుంది స్వాతి. మరోవైపు సాగర్ అక్కయ్య, తమ్ముడికి తన కూతురు సరోజను ఇచ్చి పెళ్ళిచేయాలని చిన్నప్పటినుండీ ఆశలు పెంచుకుంది. అవి కాస్తా అడియాశలవుతున్నాయని తెలుసుకుని ఎట్టిపరిస్థితిలోనూ ఈ పెళ్ళి జరగకుండాచూడాలని చాలా ప్రయత్నాలు చేసింది.