‘‘మీకు ఆ మూడులక్షలు పెద్దమొత్తం కాకపోవచ్చు. కానీ, అంతకంటే తక్కువ అప్పే తీర్చలేక మా ఊరిలో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు’’ అన్నాడు. ఎవరో నా వీపుమీద ఛెళ్ళున కొట్టినట్లు అనిపించింది. నేను మాత్రం ఏం చేస్తున్నాను. అప్పులకు భయపడి, పరువుపోతుందనే కదూ ఇలా ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాను...

*****************************

నేను డ్రైవ్‌ చేస్తున్న కార్‌ చాలా ఖరీదైనది.చాలా సౌకర్యవంతంగా ఉంటుంది దానిలో ప్రయాణం చేస్తూ ఉంటే. ఈ డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని నా కార్‌ నేనే నడుపుకుని చాలా సంవత్సరాలైంది. స్టీరింగ్‌ వీల్‌ తిప్పుతూ ఉంటే మన గమ్యం ఏదో మన చేతిలోనే ఉంది అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు! మన జీవితం మన చేతుల్లో ఉండదు. అది ఎవరి చేతుల్లోనో ఉంటుంది. అది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు శిఖరాగ్రాలకు చేరుతుందో ఎప్పుడు దారి తప్పి లోయలోకి పల్టీలుకొట్టి భగ్గుమని దగ్ధమవుతుందో మన జీవితాలను శాసించే ఆ భగవంతుడికితప్ప మనకు తెలియదు.

 

ఇలాంటి పరిస్థితి ఒకటి నా జీవితంలో ఎదురవుతుందని నా మటుకు నాకు కూడా తెలియదు. కనీసం కలలో కూడా అలాంటి ఆలోచన రాలేదు. ఊహించడానికే చాలా అసహజంగానూ, అసంబద్ధంగానూ ఉండే ఇలాంటి పరిస్థితి! ఛా! ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు.నేను కాబట్టి ఎవరికీ ఏమీ తెలియకుండా జాగ్రత్తగా మానేజ్‌ చేస్తున్నా. మరెవరైనా అయితే ఈ పరిస్థితిని తట్టుకోలేక బావురుమనేవారు.బయట వాతావరణం చల్లగా ఉంది.

ఆకాశం మేఘావృతమై ఉండడంతో సాయంత్రం నాలుగున్నరకే చీకటి ముంచుకొస్తున్నట్లు ఉంది. అదీగాక నేను ప్రయాణిస్తున్న దారి దట్టమైన అడవులు, కొండలమధ్య ఉండడంవల్ల కూడా త్వరగా చీకటి పడుతున్నట్లు అనిపిస్తోంది. నేను వెళ్ళాల్సిన చోటుకి ఇంకోగంటలో చేరుకుంటాను. అది నాకు చాలా ఇష్టమైనచోటు. నా ప్రతి విజయంతో నేను నా మిత్రులతోనూ, కుటుంబసభ్యులతోనూ ఆనందించడానికి అక్కడికే వెళ్ళేవాడిని. అక్కడ ఉన్న గెస్ట్‌హౌస్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ రాత్రి అక్కడ గడపాలని అనుకున్నాను.