సాయంకాలం ఐదు గంటలైంది.శ్రీకాంత్ ఆఫీసు నుంచి బయటకొచ్చాడు.ఇంటికి వెళదామంటే చిరాకనిపించింది.భార్య పుట్టింటికి వెళ్ళింది. ‘ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడకి వెళ్ళాలి?’శ్రీకాంత్‌కి పెద్దగా ఫ్రెండ్స్‌తో గడిపే అలవాటు లేదు. ఆఫీసూ – ఇల్లూ...అంతే!
భార్య ఇందిరతో కబుర్లుచెబుతూ గడపటమే అతనికి పెద్ద కాలక్షేపం. రోడ్డుమీద అలా నడుస్తున్నాడు.పెళ్ళాం ఇంటిదగ్గర లేకపోతే పెద్ద పండుగలా ఫీలవుతారు ఆఫీసులో అతనితో పనిచేసే కొంతమంది.‘హమ్మయ్య!’ అనుకుంటారు సంతృప్తిగా!‘‘దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఇంత ఆనందంగా ఫీలై ఉండరు మనవాళ్ళు. అంత ఆనందంగా ఉంది మా ఆవిడ ఊళ్ళోలేకపోవటం’’ ప్రక్క సీట్లో ముకుందం ఒకమాటు అన్నాడు.శ్రీకాంత్‌కి చాలా ఆశ్చర్యం వేసింది. ‘‘అదేమిటి? మీ ఆవిడ ఇంట్లో లేకపోతే అంత ఆనందంగా ఫీలవుతున్నావ్?’’ అడిగాడు అతన్ని.శ్రీకాంత్‌ని పిచ్చోణ్ణి చూసినట్లు చూశాడు ముకుందం. ‘‘ఆనందమా? ఎగిరి గంతేయ్యాలని ఉంది నాయనా!... లేకపోతే అదిలేదు, ఇదిలేదూ అంటూ వేయిపనులు పురమాయిస్తూ ప్రాణం తోడేస్తుంది కదూ? ఇప్పుడిక చూడు...’’ అంటూ పగలబడి నవ్వాడు ముకుందం.
శ్రీకాంత్‌కి అతనలా ఎందుకు నవ్వాడో అర్థం కాలేదు. ముకుందం శ్రీకాంత్ ప్రక్కకి వంగి, ‘‘ఏమిటి బ్రదర్! మరీ అమాయకంగా అడుగుతావ్? ఒక్కభోజనం ఏమిటీ ఆ నాలుగురోజులూ అంతా బయటే’’ అంటూ కన్నుగీటాడు. అంటే... అంటే... శ్రీకాంత్‌కి ఆ జవాబు విని మతిపోయింది. ప్రక్కన హారన్ మోగిస్తూ పోయిన కారుశబ్దానికి ఈ లోకంలోకి వచ్చాడు.అలా నడుస్తూ అతను బజారులోకివచ్చి ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాడు. అతనికి ‘మల్లెపూలు.. మల్లెపూలు’ అని పక్కనే అరుపులు వినిపించింది. ప్రక్కకు తిరిగి చూశాడు.