‘‘ఎంత ధైర్యం సార్ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట... అబ్బా ... ఆయప్పది గుండెకాయ కాదు సార్ - ఇనపముద్ద...’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను.
‘‘ఏడీ సురేష్ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే... వాల్ల క్లబ్బులో అయితే కోరిన టిఫిను తినొచ్చునంట. ఇక్కడి గడ్దీగాదం నేనెందుకు తింటా.. ఖర్మా? అక్కడ చికెను మటన్‌తో పులిభోజనం దొరుకుతాంటే.. అని ఎల్లబారి పాయెనే’’ అన్నాడు.చిన్నగా నవ్వాను.‘‘సరే సరే ... స్నానం చేసిరాపో..’’ చెప్పాను.వీరారెడ్డి బాత్రూంలో దూరాడు.ముగ్గురమూ రాత్రి పోరుమామిళ్లలో బసెక్కి ఉదయం ఆరుగంటలకంతా హైదరాబాదు చేరుకొన్నాము.నాకు రెండు రోజుల సాహిత్య సమావేశాల పని.కొత్తగా తవ్వించిన బోరుబావిలో దించేందుకు సబ్ మెర్సిబుల్ మోటారు పంపు, స్టార్టరు, పైపులు వగైరాల కోసం వచ్చాడు వీరారెడ్డి. మంచి బ్రాండెడ్ కంపెనీ సరుకైతే లక్షరూపాయలకు పైగా ధర పలుకుతుందట.
లోకల్ అసెంబుల్డయితే యాభైవేల లోపేనంట. అవి కూడా పోరుమామిళ్లకు ఇక్కడికీ పదివేల రూపాయల ధర తేడా వుంటుందంట.పాతిక వేలు ఎవరో ఇస్తానన్నారనీ, నన్ను మరో పాతికవేలు అప్పు అడిగాడు వీరారెడ్డి. ఏ చెడు అలవాట్లూ లేని రైతు అతను. వ్యవసాయ పనులు తప్ప మరో వ్యాపకం లేనివాడు. పైరెండి పోతోందని కళ్ల నీళ్లు పెట్టుకొంటే సరేనన్నాను.డబ్బు సమకూడినపుడంతా హైదరాబాదు వచ్చి పేకాడి వెళ్లటం సురేష్‌కు ఈనాటి అలవాటు కాదు.
పల్లెల వ్యాపారమంతా చేతిలో పెట్టి అతని నాన్న హఠాత్తుగా మరణించినప్పటి నుండి అదలించే వాళ్లు లేకపోవటంతో పేకాటను ప్రవృత్తిగా మార్చుకొన్నాడు. అలాగని వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయట్లేదు. పల్లెల మీద ఇప్పటికీ అతనిదే పట్టు. నాలుగు రోజులు అటో ఇటో అయినా సరకుకు సంబంధించిన సొమ్ము కచ్చితంగా తెచ్చిస్తాడనే పేరుంది.కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమంలో రాయలసీమ కథా సాహిత్యాన్ని గురించి మాట్లాడేందుకు వచ్చాను. నా పత్ర సమర్పణ రెండవరోజు ఉంటుంది.