ఒకానొకప్పుడు చందనపురం గ్రామంలో రామదాసు అనే తెలివైన యువకుడు ఉండేవాడు.వాడి దురదృష్టమో ఏమోగానీ ఏపని చేసినా కలిసొచ్చేదికాదు. ఒకరోజున ఆ ఊళ్లోని పండితుడొకడు వాణ్ణి చూసి జాలిపడి, ‘‘నాయనా! ఈ ఊరు నీకు అచ్చిరాలేదు. ఇక్కణ్ణించి బయల్దేరి దండకారణ్యానికి వెళ్లు. అక్కడ శుచీంద్ర మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దురదృష్టవంతుల జాతకాన్ని మార్చగలడని చెప్పుకుంటారు. నీవు ఆయన్ని కలుసుకుని నీ కథ చెప్పుకో, మేలు జరుగుతుంది’’ అన్నాడు.
రామదాసు పండితుడి కాళ్లకు మ్రొక్కి అక్కణ్ణించి బయల్దేరాడు. రాత్రనక, పగలనక నాలుగురోజులు కష్టపడి ప్రయాణంచేసి దండకారణ్యంలోని శుచీంద్ర మహామునిని కలుసుకున్నాడు.ఆ సమయానికి హిమాలయాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు శుచీంద్ర మహాముని. ఆయన రామదాసు కథ విని జాలిపడి, ‘‘నాయనా! నేనిప్పుడు ప్రయాణం హడావుడిలో ఉన్నాను. నీ దురదృష్టాన్ని పోగొట్టాలంటే - అగ్నిహోత్రం ముందు నీచేత ఒకరోజంతా జపహోమాలు చేయించాలి. అది ఇప్పుడు సాధ్యపడదు. కానీ నీకు పని సానుకూలమయ్యే మరో ఉపాయం చెబుతాను. ఇక్కడికి వేయిగజాల దూరంలో నా శిష్యుడు శౌనకుడు తపస్సు చేసుకుంటున్నాడు.
అతడు నన్ను మించిన తపోబలసంపన్నుడు. నీకు అతడు తప్పకసాయపడతాడు. కానీ అతడిప్పుడు ఘోరతపస్సులో ఉన్నాడు. నేనుతప్ప ఇంకెవ్వరు పిలిచినా పలుకడు. కాబట్టి ఒకేఒక్కసారికి మాత్రం నా గొంతుతో నా శిష్యుణ్ణి పిలిచేశక్తి నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్లి నీ కార్యం సాధించుకో’’ అన్నాడు.రామదాసు శుచీంద్రుడి కాళ్లకుమ్రొక్కి అక్కణ్ణించి బయల్దేరి శౌనకుడు తపస్సు చేసుకుంటున్న చోటకు చేరుకున్నాడు. ఆ సమయానికి ఓ రావిచెట్టుకింద ఉగ్రతపస్సులో ఉన్నాడు శౌనకుడు. అతడు అంత ఉగ్రంగా తపస్సుచేయడానికి ఒక కారణం ఉంది.