రాజులు తమ ఆస్థానమందిరాల్లో సాహిత్యగోష్టులు నిర్వహించడం, కవి పండితులు రాజును సంతోషపెట్టి గొప్ప నజరానాలు పొందడం పరిపాటే. కానీ సింధూరదేశంలో మాత్రం పూటకూళ్ళమ్మ ఇంట్లో ఆశ్రయంపొందిన ఒక కవిపండితుడు అక్కడికి భోజనానికి వచ్చేవారికి తన సాహిత్యంతో వినోదం అందిస్తూ దేశవిదేశీ కవులను సైతం తనవద్దకు రప్పించుకున్నాడు. దాంతో రాచకొలువులో సాహిత్యగోష్టులు వెలవెలబోయాయి. అప్పుడు రాజు ఏం చేశాడంటే....
*************************************
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, ఏ ప్రయోజనం ఆశించి ఈ అపరాత్రివేళ ఒంటరిగా శ్రమపడుతున్నావో తెలియదు. కానీ ఈ సమయంలో నీకు కథలుచెప్పి సత్కాలక్షేపం ఇస్తున్న నాకంటే గొప్ప ప్రయోజనం సాధిస్తావనుకోను. నేనేదో నా గురించి గొప్పలు చెబుతున్నాననుకోకు. పదిమందికి సత్కాలక్షేపం ఇవ్వడమే జీవితాశయంగా పెట్టుకుని, అందుకు ఓ మహారాజు ప్రశంసలందుకున్న సుపాత్రుడి కథ వింటే నువ్వూ ఇదే మాటంటావు. శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.సింధూర దేశాన్నేలే ప్రతాపుడికి సాహిత్యమంటే చెప్పలేనంత ప్రీతి. ఆయన కొలువులో ప్రతిరోజూ కొన్నిగంటలపాటు సాహిత్యగోష్ఠులు జరిగేవి. వాటిలో ఎందరో కవులు, పండితులు పాల్గొని సభికుల మనసు రంజింపజేసేవారు.
ప్రతాపుడు వారికి విలువైన కానుకలిచ్చేవాడు.ఆ దేశంలోనే పల్లవరంగ్రామంలో సుపాత్రుడనే మహాపండితుడున్నాడు. తనవద్ద విద్యాభ్యాసంచేసే అనేకమంది శిష్యులిచ్చే కానుకలతో ఆయనకు రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. ఆయనభార్య వాణి మాత్రం ఈ సంపాదనతో తృప్తిపడక ఆయన్ను రాజదర్శనం చేసుకుని విలువైన కానుకలు తెమ్మని పోరుతూ ఉండేది.‘‘పంచినకొద్దీ పెరిగేది విద్య. వాడినకొద్దీ తరిగేది డబ్బు. పండితులకు రాజసన్మానం కంటే విద్యాబోధనే గొప్ప’’ అని సుపాత్రుడామెకు నచ్చజెప్పేవాడు.ఇలా ఉండగా ఆ దేశపు రాజు ప్రతాపుడికి జబ్బుచేసి మంచంపట్టాడు. యువరాజు ప్రమోదుడు ఇంకా చిన్నవాడు కావడంతో అందాకా రాణి తమ్ముడు వికారుడు రాజయ్యాడు. వికారుడికి సాహిత్యమంటే కంటగింపు. ‘కవిపండితులంటే, విలువైనకాలాన్ని పనికిరానికబుర్లతో వృథాచేసే సోమరులే’ అని భావించే వికారుడు రాజవగానే కొలువులో సాహిత్యగోష్ఠులు అగిపోయాయి. ఆస్థాన కవి పండితులు మాత్రం మొక్కుబడికి ఆ పదవుల్లో కొనసాగుతున్నారు.