విద్యార్థి అతడు. గురువు దగ్గర పాఠాలేకాదు, జీవితానుభవపాఠాలూ అభ్యసించాడతడు. అమ్మ తిట్టినా, నాన్నకొట్టినా ఆ అరుగులే అతడికి ఆసరా. ఆ అరుగులే అతడికి పట్టుపాన్పులు. గురువే అతడికి బాసట. అమ్మగారి మాటే అతడికి వేదవాక్కు. ఎదుగుతూ క్రమంగా నోరుమంచితనమూ నేర్చాడతడు. కానీ ఊరుమాత్రం మంచితనం చూపించలేదు. పొమ్మని వెలివేసింది! అప్పుడు అతడేంచేశాడు?ఆ గురువేమన్నాడు?
ఊరు చేరగానే నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన ఆనందమంతా ఆ ఇంటిని చూసిన క్షణంలోనే ఆవిరైపోయింది. ఇంటి గోడలకి అక్కడక్కడ పగుళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అయ్యవారి అమ్మగారి ఆరోగ్యం ఎలాఉందో? అనే ఆలోచనతో గుండె దడదడలాడింది.అడుగుపెట్టగానే ఆహ్లాదపరిచే అందమైనతోట అక్కడ ఉండేదని అనుకోవడానికి ఆనవాలుగా పచ్చనిమొక్క ఒక్కటీ లేదిప్పుడు!నాకు దేవాలయ సమానమైన ఆ ఇంటిని కళ్ళు విప్పార్చి పరికించి చూశాను.ఏదో భక్తి పారవశ్యం పొంగి వచ్చిందిహరహర మహాదేవ...శంభోశంకర!ఒక్కక్షణం మనసంతా ఆ శివనామస్మరణతో మారుమోగిపోయింది!ఇంటి మెట్లెక్కి అటూఇటూ ఉన్న విశాలమైన ఎత్తు అరుగుల్ని చూడగానే ఏదో ఆత్మీయత పెల్లుబికింది.ఆ మూలకి చూశాను. బావి, బొక్కెన అక్కడే ఉన్నాయి. ఉత్సాహంగా, చకచకా అటు అడుగులువేసి, బావిలో చేదవేసి నీళ్ళు తోడుతుంటే నా వెనకేవచ్చి నిలబడిన గౌతమ్ ‘‘సా...సార్....ఏమిటిది మీరు’’ అంటూ తత్తరపడ్డాడు.
నా చర్య అతనికేం అర్థమవుతుందీ? అసలు నా కూడా నా పి.ఏ గౌతమ్ వచ్చిన విషయమే మరచిపోయాను!గౌతమ్ మాటలతో బాల్యస్మృతుల లోకంనుంచి బయటపడి ‘‘గౌతమ్ మీరు మన ఇంజనీర్లతో కలిసి ఆ స్థలం దగ్గర పని చూడండి..’’ అని చెప్పాను. అతడు ఏదో అడగాలని సంశయిస్తున్నట్టు కనిపించేసరికి ‘‘నేను కాసేపట్లోవచ్చి కలుస్తాను. తిరిగి వెళ్ళేటప్పుడు మీకు అన్నీ వివరంగా చెబుతాను’’ అన్నాను.గోడవారగా చీపురు అప్పటిలాగే అక్కడే ఉంది. పెద్ద బక్కెట్తో నీళ్ళూ, చీపురు తీసుకువచ్చి మెట్లమీదా, అరుగులమీదా పోసి చీపురుతో శుభ్రంగా కడిగేశాను. గౌతమ్ని అక్కడినుంచి పంపించేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకేదో అయిందనుకుని బిత్తరపోయేవాడేమో.ఆ అరుగుమీద అయ్యవారు కూర్చునే చోటును చేతులతో తాకితే మనసంతా చల్లనివెన్నెల పరుచుకున్నట్లయింది. సరస్వతీదేవి పాదాలుతాకి ప్రణమిల్లితున్నట్టు అపూరూపమైన అనుభూతి, తన్మయత్వం..