దేశ ద్రోహం చేసినవాళ్ళు విదేశాల్లో ఎంజాయ్ చేయడం, నిస్వార్థసేవాతత్పరులు స్వదేశంలోనే ఏదో ఒక వంకతో కష్టాలు పడటం ఇప్పుడు మనదేశంలో ఒక సరికొత్త గ్లోబలైజేషన్ నీతి. కాలాన్నిబట్టి నీతి మారుతూ ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారుగానీ మనిషి మనుగడకు వెన్నుముకలా కాపుకాసే మానవత్వపు నీతి మాత్రం చెదలుపట్టని నిప్పులా కాలంతో సమానంగా ప్రజ్వలిస్తూనే ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ కథలోని ప్రజలే. అదెలాగంటే....
********************
ఆ బోర్డుని చూస్తే,‘నా రెండు చేతులతో శక్తివంచన లేకుండా నిన్ను కాపాడాతా’ అన్నట్టు రక్తసిక్తమైన ఒకచేతిని తెల్లని కోట్ తొడుక్కున్న రెండుచేతులు పట్టుకుని ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడతాయి. వాటి పక్కనే, ‘ఆపన్నహస్తం అక్యూట్ కేర్’ అనే అందమైన అక్షరాలుంటాయి.అందమైన పేరున్నప్పుడు, ‘అందమైన అక్షరాలుతప్ప వేరేసొగసులు అద్దక్కరలేదని అనుకున్నారు కాబోలు’ అనిపించేలా నిరాడబరంగా ఉంటుంది ఆ బోర్డు. ఆ రోజు ఆ ఆసుపత్రి బయట ఒకటే కోలాహలం. ఎవరో పేషెంట్ పోయారని కాదు. అసలు ఆ ఆసుపత్రే పోయేపరిస్థితి వచ్చింది. బ్యాంకు ఋణాలు కట్టనందుకుగాను, ఆసుపత్రి ఆస్తులు, ముఖ్యంగా దిగుమతి చేసుకున్న ఖరీదైన పరికరాలు, మెషీన్లు వగైరాలన్నింటినీ వేలంవెయ్యాలని బ్యాంకువారు నిర్ణయించారు. ఆ రోజునే వేలం. అందుకే ఆ హడావుడి.పూర్వకాలంలో ఒక జమీందారు దివాలా తీస్తే, వాళ్ళ విరోధులు ఆ జమీందారీని కొనుక్కోవడానికి ఎగబడేవారు, దివాలా పుండుతో ప్రత్యర్థి బాధపడుతూంటే దానిమీద విజయగర్వం అనే కారం జల్లవచ్చనే ఉద్దేశ్యంతో.
అలాగే, ఈ పరికరాలని ఉపయోగించే తెలివితేటలు ఆ చుట్టుపక్కల మరెవ్వరికీ లేకపోయినా, ఊళ్ళోనూ, చుట్టుపక్కలా ఉండే పెద్దపెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులువచ్చి కూర్చుంటున్నారు. ఆ పరికరాలను కారుచౌక ధరకే కొనెయ్యాలని.ఆ కాంపౌండ్లో ఓ చెట్టుక్రింద కూర్చున్న ఒకాయన మౌనంగా ఇదంతా గమనిస్తున్నాడు. ఆయన ఒక పెద్ద గందరగోళంలో ఉన్నట్టు ఆయన మొహమే చెబుతోంది. చూసినవాళ్ళు అలా అనుకుంటారు. కానీ కొనుగోలు చెయ్యడానికి వచ్చినవాళ్ళు, ఆయన్ని వేలెత్తి చూపి, ‘‘చూశారా, ఆయన మొహం ఎలా మాడిపోయిందో! ఏ దారిలో వెళ్ళాలో నిర్ణయించుకోలేని సందిగ్ధమంటే ఇదేనేమో! ప్రాణంమీదికి వచ్చినా, బిక్కమొహం వేసుకుంటే, పనేం జరుగుతుంది?’’ అని గుసగుసలకెక్కువగాను, దండోరాకి తక్కువగాను మాట్లాడుకుంటున్నారు. అది గందరగోళస్థితి కానేకాదని, ఆయన మనసు లావా కక్కడానికి సిద్ధంగా ఉన్న ఓ అగ్నిపర్వతంలా ఉందని ఆయనకి తెలియకపోలేదు. ఎంతైనా డాక్టరుకదా! ఇంతలో ఆయన మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది.