‘క్రికెట్ మైదానంలో మరణించిన క్రికెటర్ కనకయ్య’పేపర్లో వార్త పైకి చదివాడు అసిస్టెంట్ రాము.‘‘ఎలా మరణించాడు?’’ పుస్తకంలోంచి తలెత్తి అడిగాడు డిటెక్టివ్ శరత్.‘‘బ్యాట్స్‌మన్ వేగంగా కొట్టిన బంతి ఫీల్డర్ కనకయ్య కణతలకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు’’ చెప్పాడు రాము.
ఇంతలో సెక్రటరీ సుధ లోపలకు వచ్చి, ‘‘బాస్ రమణయ్యట, మిమ్మల్ని కలవాలంటున్నారు, అతని తమ్ముడు కనకయ్య హత్య గురించి మాట్లాడాలట’’.‘రమ్మను’ అన్నాడు శరత్.మూర్తీభవించిన విషాదంలా ఉన్నాడు రమణయ్య. శరత్ ఎదుట కూర్చున్నాడు.‘‘క్రికెటర్ కనకయ్య నా తమ్ముడు. రాబర్ట్ కొట్టిన బంతి తలకు తగిలి అక్కడికక్కడే మరణించాడు’’. చెప్పాడు.‘‘ఇప్పుడే పత్రికలో చదివాను’’‘‘అది యాదృచ్ఛికం కాదు, పథకం ప్రకారం జరిగింది!’’కనుబొమ్మ ఎగరేశాడు శరత్.‘‘నాలుగైదు నెలలుగా నా తమ్ముడిమీద హత్యాప్రయత్నాలు జరుగుతున్నాయి. దైవికంగా తప్పించుకుంటున్నాడు. ఈసారి తప్పించుకోలేకపోయాడు’’ రమణయ్య కన్నీళ్ళు పెట్టుకున్నాడు.‘‘హత్య అని ఎలా చెప్తారు?’’‘‘నాలుగునెలలక్రితం బరోడాలో మ్యాచ్‌కి వెళ్లినప్పుడు, మరో క్రికెటర్‌తో కలిసి కార్లో వెళ్తూంటే లారీ వెంటాడి ఢీకొట్టి కారును నుజ్జునుజ్జు చేసింది.
స్వల్పగాయాలతో ఇద్దరూ బయటపడ్డారు. కలకత్తాలో మ్యాచ్ ఆడే రోజు పుడ్ పాయిజనింగ్ జరిగింది. అదే ఐటమ్ తిన్న మిగతావారంతా బాగానే ఉన్నారు. సకాలంలో ట్రీట్మెంట్తో బయటపడ్డాడు. ఢిల్లీలో మ్యాచ్‌కి ముందురోజు ప్రాక్టీసులో బంతి తలకు తగిలింది. అంతకుముందు ఫ్రెండ్లీమ్యాచ్లో బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి కంటిపైన తగిలి కుట్లుపడ్డాయి. ఇవన్నీ యాధృచ్చికం అనిపించటంలేదు. నిజానిజాలు మీరే తేల్చాలి’’ కన్నీళ్ళతో ప్రాధేయపడ్డాడు రమణయ్య. రాము వైపు చూశాడు శరత్. రాము తల ఊపాడు.‘సరే. మీరు వివరాలన్నీ రాముకి ఇవ్వండి, పరిశోధిస్తాం’’ అన్నాడు శరత్.