‘‘పరిశోధనలో మాకు డెడ్‌ఎండ్ ఎదురైంది. ఈ కేసుని నువ్వు టేకప్‌చేసి, కొత్తకోణంలో పరిశోధిస్తావా?’’ఫైలు డిటెక్టివ్ శరత్ టేబుల్ మీద పెడుతూ అడిగాడు ఇన్స్పెక్టర్ విజయ్.‘‘ఏం కేసు?’’ ఫైలు తెరుస్తూ అడిగాడు శరత్.‘‘ప్రదీప్ హత్య కేసు’’.
‘ఈ కేసు హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. పట్టపగలు నడిరోడ్డుమీద సినిమాఫక్కీలో కొడవళ్ళతో వేటాడిమరీ ప్రదీప్‌ని నరికిచంపారు. తరువాత దర్జాగా వారివెంట వస్తున్న కారులో ఎక్కి పారిపోయారు. ఆ సమయానికి అక్కడ ఉన్న వారు జరుగుతున్న దాన్ని తమ సెల్ఫోన్లలో బంధించటానికి చూపించిన ఆసక్తి, వాళ్ళని అడ్డుకోవడానికిగానీ, పదిమందీ కలిసి వాళ్లని చుట్టుముట్టి పట్టుకోవడానికిగానీ ఆసక్తి చూపించలేదు. వాళ్లు ముఖాలకు ముసుగులు వేసుకుని ఉండటంతో సరిగ్గా గుర్తించడం కష్టమైపోయింది. వారు ఎంత పకడ్బందీగా పథకం వేశారంటే, వారు కారును రోడ్లపై ఉన్న సర్వైలెన్స్ కెమేరాలకు సరిగ్గా చిక్కకుండా నడిపించారు.
ఓ మెట్రో పిల్లర్ క్రింద కారును ఆపారు. ఆ తరువాత అదృశ్యమయ్యారు. వారం క్రితం దొంగతనం చేసిన కారు అది. కారులో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. విచిత్రమేమిటంటే ప్రదీప్ గురించి ఎలాంటి వివరాలు తెలియటం లేదు.అతడు దమ్మాయిగూడ ప్రాంతంలో ఉంటాడని తెలిసింది. అతను అద్దెకు ఉంటున్న ఇంటియజమానికి కూడా అతడి గురించి ఏ వివరాలు తెలియవు. ఇసిఐఎల్ దగ్గర్లోవున్న ఓ షాపులో పనిచేస్తాడని మాత్రం చెప్పారు.
షాపులో అడిగితే, అతడి గురించి తెలియదని, సేల్స్‌బాయ్ అవసరమైనప్పుడు వచ్చాడని, ఉద్యోగం ఇచ్చామని చక్కగా పని చేస్తాడని చెప్పారు. ఎవరితో కలిసే వాడు కాదు. ఎక్కువ మాట్లాడే వాడు కాదు. మూడేళ్ళుగా అక్కడ పనిచేస్తున్నాగానీ అతడి పేరుతప్ప అతడి గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు’, ఫైలులో ఆ వివరాలు చదివి నిట్టూర్చి విజయ్‌వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శరత్.