ఆమె డిగ్రీ ఫైనలియర్ స్టూడెంట్. చాలా యాక్టివ్ పర్సన్. నవ్వుతూ నవ్విస్తూ ఉండే అమ్మాయి. ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం రిపోర్టులోనూ ఆత్మహత్యగానే తేలింది. చదువు ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుందని కాలేజీలో విద్యార్థులు పెద్ద గోలచేశారు. తల్లిదండ్రులు కూడా మరోవిధంగా సందేహించలేదు. కానీ ఈ కేసులో డిటెక్టివ్ శరత్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎందుకని? అతడి పరిశోధనలో ఏం తేలింది?
*******************
తలుపు తెరచుకుని గదిలోకి అడుగుపెట్టిన యువతిని, ఆమె వెనకే అడుగుపెట్టిన సెక్రటరీ సుధను ప్రశ్నార్థకంగా చూశాడు డిటెక్టివ్ శరత్.‘బాస్..ఈ అమ్మాయి మిమ్మల్ని కలవాలంటోంది. ఏదో పర్సనల్,అర్జంట్ అంటోంది’ అని చెప్పి వెళ్ళిపోయింది సుధ.ఆ అమ్మాయి భయం భయంగా బెదురుబెదురుగా శరత్ ముందు కూర్చుంది.‘‘ఇంకా చదువు పూర్తయినట్టు లేదు, అప్పుడే డిటెక్టివ్ అవసరం ఏమొచ్చింది?’’ నవ్వుతూ అడిగాడు శరత్. ఆమె కళ్ళల్లో నీళ్ళు! ‘‘నా పేరు అనుష్క’’ మెత్తని స్వరంతో చెప్పింది.‘‘ఉజ్వల్ ప్రకాశ్ కాలేజీలో డిగ్రీఫైనలియర్ చదువుతున్నాను’’శరత్ కనుబొమలు ఎగరేశాడు. ‘‘ఆ కాలేజీలో ఈ మధ్యనే ‘అన్య’ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. యాజమాన్యంపై పెద్దగోల జరిగింది’’ శరత్ పక్కనే కూర్చున్న అసిస్టెంట్ రామూ అన్నాడు.‘‘మా కాలేజీ మంచిదేనండి. చదువు ఇష్టం లేనివాళ్ళు హింసిస్తున్నారని ప్రచారం చేస్తారు. వందమందిలో అలాంటి వాళ్ళు ఒకళ్లో ఇద్దరో. కానీ ఆ ఒకరు ఇద్దరిని పట్టుకుని మొత్తం కాలేజీని విమర్శిస్తున్నారు’’ తలవంచుకుని చెప్పింది ఆ అమ్మాయి.
‘‘ఇంతకీ నా అవసరం నీకు ఎందుకు వచ్చింది?’’ సూటిగా అడిగాడు శరత్.‘‘ఆత్మహత్య చేసుకున్న ‘అన్య’ నా ఫ్రెండ్’’రాము వైపు చూశాడు శరత్.తల ఊపి గబగబా నోట్‌బుక్ తీశాడు రాము.‘‘ఆత్మహత్య చేసుకునేముందు అన్య మీ గురించి అడిగింది!’’‘నా గురించా?’‘అవును. మిమ్మల్ని కలవాలని అంది. తనకి ఓ సమస్య ఉంది. మిమ్మల్ని పరిష్కారం అడుగుతానని అంది. నేను మీ అడ్రసు ఫోను నెంబరు సంపాదించి ఇచ్చాను. కానీ మిమ్మల్ని కలవకుండానే ఆత్మహత్య చేసుకుంది. అందరూ చదువు ఒత్తిడి అని కాలేజీని విమర్శిస్తున్నారు. కానీ అన్య ఆత్మహత్యకు వేరేకారణం ఏదో ఉంది. అది మీరు తెలుసుకోవాలి. నేను మీకు డబ్బివ్వలేను. కానీ మీరు సత్యశోధనచేస్తారు తప్ప డబ్బు ఆశించరని చెప్పారు. అందుకే మీ దగ్గరకు ధైర్యంగా వచ్చాను’’ అంది చేతి ‘వాచీ’ శరత్ టేబుల్‌మీద పెడుతూ.