షర్మిందకు హఠాత్తుగా మెలుకువ వచ్చింది. మళ్ళీ ముసుగుతన్ని పడుకుంది. అయినా నిద్రపట్టలేదు. తన పక్కన ఉండాల్సిన తన వదిన లేదు! బాత్రూమ్‌కి వెళ్ళిందేమో అనుకుంది. పది నిముషాలు దాటిపోయినా ఆమె రాలేదు. ఏమైంది? అని మెల్లగా మంచం దిగిబాల్కనీలోకి వచ్చింది. బాల్కనీకి ఆనుకున్న స్టోర్‌ రూంలో లైటు వెలుగుతోంది. పిల్లిలా అడుగులు వేస్తూ మూసి ఉన్న తలుపుల దగ్గరికి చేరుకుంది. లోపలి నుంచి..

********************************* 

యవ్వనంతో తుళ్ళిపడే పడుచుపిల్లలా ఒళ్ళు విరుచుకుని నిద్ర లేచింది ఢిల్లీ నగరం.లోనీ రోడ్‌లో వజీరాబాద్‌ వంతెన అప్పటికే బాగా రద్దీగా ఉంది. వంతెన దాటే సమయంలో భరించలేనంతగా దుర్వాసన. పాదచారులు, డ్రైవర్లు, ప్రయాణికులు ముక్కులు మూసుకుంటున్నారు.అప్పుడే ఓ మధ్య వయస్కుడు ఆ వంతెనకింద కాలువపక్కన చెట్లతోపుల్లోకి కాలకృత్యాలకోసం వెళ్ళాడు. పొదల్లో పడిఉన్న శవాన్ని చూసి భయంతో కేకలు వేస్తూ వంతెన మీదికి పరుగులు తీశాడు. కొందరు ప్రయాణికులు, ఆటో రిక్షావారు ఆగిపోయి ఏమిటన్నట్టు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న కొందరు పోలీసులకు ఫోన్లు చేయసాగారు. అంతలో పోలీసు కానిస్టేబుల్స్‌ ఆ వంతెనమీదనుంచి వెళుతూ, భజన్‌పుర పోలీస్‌ స్టేషన్‌కు ఆ కబురు అందించారు.ఇన్‌స్పెక్టర్‌ బాలకిషన్‌ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నాడు. ఆ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించాడు.శవం బాగా కుళ్ళిపోయినందువల్ల ఆ ప్రాంతం అంతా దుర్వాసన వస్తోంది. హతుడి ముఖం, శరీరం గాయాలతో పీలికలైపోయి గుర్తుపట్టేందుకు వీల్లేకుండా ఉంది.తలమీద జుత్తు, అతడి దుస్తుల్నిబట్టి హతుడు పాతికేళ్ళ యువకుడు కావచ్చని ఇన్‌స్పెక్టర్‌ ఊహించాడు.

చిరిగి పీలికలైన ఎర్రరంగు చొక్కా కాలర్‌పై లేబుల్‌ మీద ‘న్యూ ఫ్యాన్సీ టైలర్స్‌, గాబరీ’ అనే అక్షరాలు కనిపించాయి. ఇన్‌స్పెక్టర్‌ బాలకిషన్‌ కళ్ళు మెరిశాయి. కనీసం ఓ క్లూ దొరికిందనుకున్నాడు. ఆ అడ్రస్‌ డైరీలో నోట్‌ చేసుకున్నాడు. అక్కడ దొరికిన ఖాళీ బ్రాందీ బాటిల్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించి, ఆ చొక్కాను ఓ న్యూస్‌ పేపర్లో చుట్టుకుని ‘గాబరీ’ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ‘న్యూ ఫ్యాన్సీ టైలర్స్‌’ షాపుకోసం వెతికాడు. శ్రమ లేకుండానే ఆ షాపు కనిపించింది.