‘మా అబ్బాయి వారం రోజులుగా ఇంటికి రాలేదు. ఆఫీసులో లేడు. స్నేహితులకు వాడు ఏమయ్యాడో తెలియదు. నేను పోలీసు కంప్లయింట్ ఇచ్చాను. వారూ ఏమీ తేల్చలేక పోతున్నారు. అందుకని మీ దగ్గరకు వచ్చాను. కనీసం వాడు ఏమయ్యాడో తేల్చి చెప్పండి’ కన్నీరు తుడుచుకుంటూ చెప్పాడు కనకప్రసాద్.
‘మీ అబ్బాయి వివరాలు చెప్పండి’ అడిగాడు డిటెక్టివ్ శరత్.‘వాడి పేరు సతీష్. సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వాడిది పెద్ద సర్కిల్. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ రోజు ఆఫీసు అయిన తరువాత ఫ్రెండ్స్‌తో ఇంటికి వచ్చాడు. వాళ్లు చాలాసేపు మాట్లాడుకున్నారు. చర్చించుకున్నారు. తరువాత వాళ్లతో బయటకు వెళ్లాడు. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు’.‘ఆ రోజు ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ పేర్లు చెప్తారా?’‘కౌశల్, వైభవ్, అసావేరి. వాళ్లు నలుగురు ఒక జట్టు. ఆఫీసులోనూ, బయటకూడా’.వాళ్ల అడ్రసులు, ఫోను నెంబర్లు తెలుసుకున్నాడు శరత్.‘నేను పరిశోధిస్తాను’ హామీ ఇచ్చాడు.
ఆయన వెళ్లిపోగానే అసిస్టెంట్ రాముని పిలిచాడు.‘రాము... ఈ పేర్లు, అడ్రస్సులు తీసుకో. వీళ్ల నేపథ్యాలు తెలుసుకో. అలాగే వీళ్లు పనిచేసే కంపెనీలో కూడా సతీశ్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకో. నేను ఇన్స్పెక్టర్ విజయ్‌ని కలుస్తాను’ చెప్పి లేచాడు శరత్. ‘కేసు ఎటూ తేలటం లేదు. ఆ ముగ్గురితో ఇల్లు వదలిన తరువాత రాత్రి వరకూ గడిపాడు. ముగ్గురూ బార్కి వెళ్లారు. బీరు తాగారు. తరువాత కౌశల్, వైభవ్‌లు తమ కార్లలో ఇంటికి వెళ్లిపోయారు. సతీశ్, అసావేరితో బార్ బయట కారులోనే చాలాసేపు గడిపాడు. తరువాత అతడిని ఆటో ఎక్కించి తన కారులో అసావేరి వెళ్లిపోయింది ఇంటికి.
వీళ్లు చెప్పినదాన్ని సాక్షులు నిర్థారించారు. అసావేరి, సతీష్ బారు బయట కారులో చాలాసేపు కూర్చుని మాట్లాడుకోవటం వాచ్మెన్ చూశాడు. ఆమె అతడిని ఆటో ఎక్కించటం కూడా చూశాడు. అయితే ఆటో నెంబరూ ఇద్దరూ నోట్ చేసుకోలేదు. ఆటో అతడిని అసావేరి సరిగ్గా చూడలేదు. వాచ్మెన్ కూడా గుర్తుపట్టలేనన్నాడు. మేమూ ఆటో డ్రైవర్లందరినీ ప్రశ్నించాము. ఎవరూ తెలియలేదంటున్నారు. అదీ పరిస్థితి. మనిషి ఏమయ్యాడో తెలియటం లేదు. కనీసం శవం కూడా దొరకటం లేదు.’ వివరించాడు విజయ్.