ఆఫీసు పనిలో బిజీగా ఉన్న శ్రీహరి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.యథాలాపంగా చూసి ఉలిక్కిపడ్డాడు.‘ మీ ఖాతా నుంచి 49 వేల రూపాయలు డ్రా అయ్యాయ’ని ఆ మెసేజ్ అర్థం.తాను తీయకుండానే తన ఖాతాలో నుంచి డబ్బు ఎలా డ్రా అయ్యింది?కంగారు పడుతూనే స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.‘‘ర్రేయ్... నీ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఉంటారు. అర్జెంటుగా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి డెబిట్ కార్డును బ్లాక్ చెయ్యమని చెప్పు’’ అంటూ సలహా ఇచ్చాడు.శ్రీహరి తక్షణమే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం వివరించాడు.ఆ రాత్రంతా శ్రీహరికి నిద్ర పట్టలేదు.‘బ్యాంకులో ఖాతా తెరిచి నెల రోజులు కూడా కాలేదు... అప్పుడే ఇలా అయ్యిందేమిట్రా దేవుడా’ అనుకుంటూ ఎప్పుడు తెల్లవారుతుందా? అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
మర్నాడు ఉదయమే బ్యాంకుకు వెళ్లాడు. పదిన్నరకు బ్యాంకు ఉద్యోగులు ఒక్కొక్కరుగా వచ్చారు. అప్పటిదాకా శ్రీహరి మనసు మనసులో లేదు.‘‘సార్! నా అకౌంట్లో 49 వేల రూపాయలు డ్రా అయినట్టుగా మెసేజ్ వచ్చింది’’ అంటూ ఫోన్ చూపించాడు.
అకౌంట్ వెరిఫై చేసిన బ్యాంకు ఉద్యోగి, ‘‘అవి నిన్ననే వితడ్రా అయ్యాయి’’ అనేసరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది.‘‘సార్... మీ బ్యాంకు నుంచే ఫోన్ చేసి ఖాతా అప్డేట్ చేస్తున్నామన్నారు...’’ అని చెప్పేలోగానే ఉద్యోగి శ్రీహరిని కిందికీ మీదికీ చూశాడు.‘‘చూడండి... ఖాతా అప్డేట్ చేస్తున్నామంటూ మా బ్యాంకు వాళ్లు మీకు ఫోన్ చేయడమంటూ ఉండదు. తాటికాయంత అక్షరాలతో ఇక్కడ రాశాం కదా. అపరిచితులు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు అడిగితే చెప్పొద్దని, మీకు తరచూ మెసేజ్‌లు కూడా పంపిస్తాం’’ అంటూ క్లాస్ తీసుకున్నాడు.‘‘ అయితే ఇప్పుడేం చేయమంటారు సార్...’’‘‘పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. అంతకన్నా చేసేదేం లేదు’’ అంటూ సలహా ఇచ్చాడు.
శ్రీహరి ఫిర్యాదును పరిశీలించిన సైబర్ క్రైమ్ ఏసీపీ రఘువీర్ ‘‘ఈ మధ్య ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. అసలేం జరిగిందో చెప్పండి’’ అన్నాడు.