మూసాపేటలోని మాధవి మాన్షన్ అపార్ట్‌మెంట్...ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆ అపార్ట్‌మెంట్‌లో పొద్దున్నే కలకలం...అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో రక్తం మడుగులో పడి ఉందో యువకుని మృతదేహం.ఆత్మహత్య చేసుకున్నాడనుకుందామంటే ఆ యువకుడు అపార్ట్‌మెంట్‌వాసి కాదు.ఎవరా యువకుడు? దొంగా... లేక ఎవరైనా చంపి అక్కడ పడేశారా?ఆ మృతదేహం చుట్టూ చేరి కాలనీవాసులు భయం భయంగా చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు.అంతలోనే సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. సీన్ చూస్తుంటే ఆ యువకుడు అపార్ట్‌మెంట్ పైనుంచి కిందికి పడిపోయినట్టుగా కనిపిస్తోంది. కాని అపార్ట్‌మెంట్‌వాసులను ఎంక్వయిరీ చేస్తే అతడెవరో తెలియదని అన్నారు. దాంతో క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆ తర్వాత మృతదేహన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.
**********
ఈ కేసు గురించి అనేక కోణాల్లో ఆలోచిస్తున్నాడు ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం.ఇంతలో ఫోన్ రింగయ్యింది.‘‘సార్... నేను ఎస్సైని. మృతదేహం ఎవరిదో ట్రేసవుట్ అయ్యింది. అతడి పేరు బాలప్రశాంత్...’’‘‘ఏం చేస్తుంటాడు?’’‘‘వర్ధమాన హీరో సార్... సినిమాల్లో నటిస్తున్నాడట...’’‘‘హీరోనా... ఆ అపార్ట్‌మెంట్ దగ్గరికి ఎందుకొచ్చాడు? సరే నేను అక్కడికే వస్తున్నా...’’ అంటూ అప్పటిదాకా తెలిసిన సమాచారాన్ని ఏసీపీ భుజంగరావుకు ఫోన్‌లో తెలిపారు ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం.
మాధవి మాన్షన్ అపార్ట్‌మెంట్‌లో ఒక్కొక్కర్ని పిలిచి ప్రశ్నించడం ప్రారంభించారు పోలీసులు.అందరూ కూడా అతడెవరో తమకు తెలియదంటే తెలియదని చెబుతున్నారు. ఈ లోపు విషయం మీడియాకు తెలిసింది. ‘టాలీవుడ్ హీరో బాలప్రశాంత్ అనుమానాస్పద మృతి’ అంటూ బ్రేకింగ్ న్యూస్ ప్రారంభమైంది. ప్రశాంత్‌ది హత్యా? ఆత్మహత్యా?? అంటూ వివిధ కోణాల్లో వార్తలు రాసాగాయి. అంతేకాదు... అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఒక మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉందని కూడా పుకార్లు వ్యాపించాయి. నిజంగా ఉన్నా ప్రశాంత్ మరణానికీ, వివాహేతర సంబంధానికీ ఉన్న లింకేంటి? ఆ రాత్రి ఏం జరిగింది? ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా అతన్ని చంపేసి, సూసైడ్‌లా సీన్ క్రియేట్ చేశారా? అనే ప్రశ్నలను విలేఖరులు పోలీసులపై సంధించారు.