ఫోన్ రింగైంది. ‘‘హలో’’ అన్నాడు డిటెక్టివ్ శరత్.అవతలివైపు నిశ్శబ్దం. కానీ ఎవరో ఊపిరి పీలుస్తున్న శబ్దం వినిపిస్తోంది.‘‘హలో’’ అన్నాడు మళ్లీ.ఫోన్ కట్టైంది.‘‘ఈ బ్లాంక్ కాల్ నెంబరు ఎవరిదో కనుక్కో’’ సెక్రటరీ సుధకు ఇంటర్‌కామ్‌లో చెప్పాడు.
‘‘బాస్, ఆ కాలేజీ యువతి మర్డర్ కేసు విచిత్రంగా ఉంది’’ అన్నాడు అసిస్టెంట్ రాము. శరత్ ఫోను పెట్టగానే‘‘విచిత్రం ఏముంది?’’‘‘హంతకుడి అడ్రస్సే తెలియదు బాస్ ఎవరికీ!కాలేజీ కారు పార్కింగ్‌లో ఆ అమ్మాయి ఎవరినో కలవడానికి వెళ్లింది. వాడు ఆమెని కత్తితో కసితీరా పొడిచి వెళ్లిపోయాడు. వాడు ఎవడో, ఎటువెళ్లాడో, ఎవరూ చూడలేదు. అసలు కాలేజ్ టైమ్‌లో పార్కింగ్ ప్లేసులో ఇతడు ఓ అమ్మాయిని హత్య చేస్తుంటే ఎవరూ చూడకపోవటం ఒక విచిత్రమైతే, ఎవరి కంటపడకుండా వాడు తప్పించుకోవడం మరీ విచిత్రం’’ అన్నాడు రాము. శరత్ మాట్లాడలేదు. అంతలో మళ్లీ ఫోను మ్రోగింది.‘‘హలో’’ అన్నాడు శరత్.
అవతలివైపు నిశ్శబ్దం.ఈసారి శరత్, అవతలివైపు ఇండక్షన్ శబ్దాన్నిదాటి వినిపిస్తున్న శబ్దంపైనే దృష్టి కేంద్రీకరించాడు. జాగ్రత్తగా వింటే ఎవరో ఏడుస్తున్నట్టు, ఏడుపును అదిమి పడుతున్నట్టు అనిపించింది.ఇంతలో ఫోన్ కట్ అయింది. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ ఫోన్ చేశాడు. అతడితో మాట్లాడిన తర్వాత,ఫోను అందుకుని మాట్లాడిన శరత్, రాము వైపు చూశాడు.‘‘ఆ అమ్మాయి హత్య కేసు పరిశోధన చేద్దాం పద’’ అన్నాడు రాముతో. ‘‘ఎలాంటి క్లూలు దొరకటం లేదు. కత్తిమీద వేలిముద్రలు లేవు. అమ్మాయి ఫోనుకాల్స్ని పరిశీలించాం. ఆధారాలులేవు. ఎవరినైనా కలవటానికెళ్ళిందేమో తెలియదు. క్లాసులో పాఠాలు వింటూ మధ్యలో లేచి బయటకువెళ్లింది. మిట్టమధ్యాహ్నం హత్య, హంతకుడి పరారీ విదాస్పమవుతోంది’’ చెప్పాడు విజయ్.