‘బాస్ ఈ వార్త చూశావా?’ ఉత్సాహాంగా డిటెక్టివ్ శరత్ ముందుకు వచ్చి కూర్చున్నాడు అసిస్టెంట్ రాము.‘పిల్లకు పాలిచ్చి చంపిన తల్లి’ గమ్మత్తుగా ఉంది కదా?’ అడిగాడు రాము.రాము వైపు ఆలోచనగా చూశాడు శరత్ ‘చదువు’ అన్నాడు.
‘అర్చనకు ఇరవయి అయిదేళ్లు. రెండు సంవత్సరాల క్రితం పెళ్లయింది. ఆమె భర్త నాగరాజు మెడికల్ రిప్రజెంటేటివ్. వాళ్లకు ఇటీవల పాప పుట్టింది. పుట్టి మూడు నెలలవుతోంది. అయితే అర్చన ఒకప్పుడు డ్రగ్ ఎడిక్ట్ అవటంతో పిల్లకు ఆమెని పాలివ్వద్దన్నారు డాక్టర్లు. రెండు రోజుల క్రితమే అన్ని పరీక్షలూ పూర్తయిన తరువాత ఆమె పాలు ఇవ్వచ్చన్నారు. ఒకరోజు పాలు ఇచ్చింది. రెండో రోజు పాలిచ్చేసరికి గంటలో పాప కళ్లు తేలేసింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లే లోపలే మరణించింది.ఆరంభంలో పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆమె తాను పాలు ఇవ్వలేదంది. పిల్ల ఏడుస్తుంటే సెరెలాక్ కలిపివ్వమని భర్తను అడిగేనని, ఆయన ఇస్తే అదే తాగించానని చెప్పింది. కానీ పోస్ట్‌మార్టమ్ పరీక్షలో పాప శరీరంలో మెథాడన్, ఆంఫిటామైన్, మెథామ్ఫిటామైన్ కనబడింది.
అవే శిశువు మరణానికి కారణం అని నిర్ధారించారు. దాంతో మళ్లీ తల్లిని ప్రశ్నించారు. అప్పుడామె నిజం చెప్పింది. డాక్టర్లు పాలు ఇవ్వచ్చని చెప్పినప్పటి నుంచీ అంటే శిశువు జన్మించిన రెండో రోజు నుంచీ తానే పాలు ఇస్తున్నట్టు చెప్పింది. కానీ రెండు మూడు రోజులుగా పాలు రాకపోవటంతో సెరెలాక్ లాంటిది ఇస్తున్నానని, ఆ రోజు పాప ఏడుస్తుంటే లేచి సెరెలాక్ తయారుచేసే ఓపిక లేకపోవటం వల్ల ‘బ్రెస్ట్ ఫీడింగ్’ చేసిందని, తరువాత భర్తని సెరెలాక్ చేసిమ్మంటే అది చేసిచ్చాడని చెప్పింది.
పిల్ల మరణించడంతో భయపడి ‘బ్రెస్ట్ ఫీడింగ్’ చేసినట్టు చెప్పలేదని ఒప్పుకుంది. కానీ తాను డ్రగ్స్ తీసుకోవం లేదని, గర్భవతి అయినప్పుటి నుంచీ డాక్టర్ల సలహాను అనుసరించి డ్రగ్స్‌కు దూరంగా ఉన్నానని చెప్తోంది. అయితే ఆమెకు పెయిన్‌కిల్లర్ల అడిక్షన్ ఉందని, దానివల్ల డాక్టరు ‘మెథాడాన్’ మందు ఇచ్చారని అదొక్కటే, అదీ డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకుంటున్నానని చెప్పింది. కానీ మిగతా డ్రగ్స్ ఉండే వీలులేదని చెప్పింది. ‘కానీ పోలీసులు శిశుహత్యా నేరం ఆమె మీద మోపి అరెస్టు చేశారు’ గబగబా వార్త సారాంశం చెప్పాడు రాము.