‘‘డిటెక్టివ్ శరత్?’’అసిస్టెంట్ రాము వైపు చూస్తూ ప్రశ్నించాడతడు.శరత్ వైపు వేలు చూపించాడు రాము.అతడు తన వైపు చూడగానే చిరునవ్వు నవ్వి ‘‘ఏం కావాలి?’’ అడిగాడు శరత్.అతడు శరత్‌కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. నుదుటి చెమట తుడుచుకున్నాడు.
‘‘నా పరువు కాపాడాలి’’ అన్నాడు.కనుబొమలెగరేశాడు శరత్.అతడు ఓ కవర్ టేబుల్‌పై ఉంచి శరత్వైపు తోశాడు.కవర్ తెరచి చూశాడు శరత్.దాన్లో ఓ అమ్మాయి అబ్బాయి కామకేళీ విలాసాల ఫొటోలు ఉన్నాయి.వారిద్దరికీ తమను ఎవరో ఫొటో తీస్తున్నారని తెలిసినట్టులేదు.ఫొటోలు మళ్ళీ కవర్లో పెట్టి అతనివైపు ప్రశ్నార్థకంగా చూశాడు శరత్.‘‘ఆ ఫొటోలో ఉన్నది నా కూతురు శారద. వాడు..’’ కోపంతో మాట్లాడలేకపోయాడాయన.రాముకు ఫొటోల కవర్ అందించాడు శరత్.‘మీ అమ్మాయి చదువుతోందా?’‘చదువైపోయింది. ఉద్యోగం చేస్తోంది. అక్కడే పరిచయమయ్యాడు వాడు. వాడితో సన్నిహితంగా ఉంది. అయితే వాడు సోమరిపోతు. ఉద్యోగం చేయలేడు. తీసేశారు. వాడిని తీసేసింది నా కూతురే. అది మేనేజర్ అయింది.
వాడింకా చేరిన స్థాయిలోనే ఉన్నాడు. దాంతో వాడు కక్షకట్టాడు. వెంటపడితే పోలీసు రిపోర్టిచ్చింది. ఇదిగో, ఆ తరువాత ఈ ఫొటోలు పంపాడు. ఇవి బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నాడు. వీడియోలు కూడా ఉన్నాయట. అవన్నీ బహిర్గతం చేయకూడదంటే అయిదుకోట్లు అడుగుతున్నాడు’’.‘‘మీ అమ్మాయి ఏమంటోంది?’’ మృదువుగా అడిగాడు శరత్.‘‘వాడితో సన్నిహితంగా ఉన్నట్టు ఒప్పుకుంది. వాడితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఇష్టంగానే వీడియోలో పాల్గొన్నట్టు చెప్పింది. బుద్ధిలేదీ పిల్లలకు. చిన్నప్పటినుంచీ సెల్ఫీలు కెమేరాలకు ఫోజులు అలవాటైన వీళ్లకి, ఎక్కడ కెమెరాకి ఫోజివ్వాలో, ఎప్పుడు వీడియోకి ఫోజులివ్వకూడదో తెలియటం లేదు. ఇంగిత జ్ఞానం లేదు.’’ కసిగా అన్నాడాయన.