ఒక ధీర వనిత రాజకీయ జ్ఞాపకాలు   

ఆమె పేరు తీస్తా సెత్లవాద్‌. నిరంతర న్యాయ పోరాటంలో అలసట ఎరుగని వీర వనిత. 1962 లో 
బాంబేలో పుట్టింది. తీస్తా అనేది బ్రహ్మపుత్ర ఉపనది. తీస్తా సెత్లవాద్‌ కూడా ఆ ఉధృతమైన నదివంటి 
సామాజికురాలు. కుటుంబంలో అందరూ అవలంభిం చిన న్యాయవాద వృత్తిని కాదని సామాజిక 
రుగ్మతలను రూపుమాపగల దారిలో నడిచిన సాహసి. తన ధిక్కార స్వభావానికి చేదోడుగా ఉండగల సహపాత్రికేయుడైన జావేద్‌ను భర్తగా స్వీకరించింది. ప్రధానంగా బాంబే, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఒక 
పెనుతుఫానై 1992లో ’కమ్యూనలిజం కంబాట్‌’ను స్థాపించింది. ఆ సంస్థను ఆయుధంగా చేసుకుని 
మత కల్లోలాల్లో కొనసాగిన రాక్షస హింసాకాండను దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలకూ, పార్లమెంట్‌కూ, ఇతర మానవ హక్కుల సంస్థలకూ నిర్భయంగా రిపోర్ట్‌ చేస్తూ యాక్టివిస్ట్‌గా మారింది. ఢిల్లీ సిక్కుల మారణకాండ, భూపాల్‌ గ్యాస్‌ లీక్‌, గోద్రా మారణహోమం నుండి బాబ్రీ మసీదు విధ్వంసం వరకు అనేక సంఘటనలపై పత్రికల్లో తుఫాన్లు సృష్టించింది. ఇంకా ఆమె ఒక గర్జించే ధిక్కారప్రవాహమై ప్రవహిస్తూనే ఉంది. అసలు ఈ పుస్తకానికి ‘నేనొక నదిని..’ అని కాకుండా ‘నేనొక తుఫాన్‌’ను అని పేరు పెడితే బాగుండేది. 

 

 - రామా చంద్రమౌళి 
 
నేనొక నదిని.. నా పేరు తీస్తా (అనుభవాలు)
రచన: తీస్తా సెత్లవాద్‌
పేజీలు: 224, వెల: రూ. 225
ప్రతులకు: నవ తెలంగాణ 94900 99378